
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవాన్ని సంఘ్‌లో భాగం కావడం ద్వారానే పొందాలని RSS సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఏ సంస్థ అయినా ఉత్సవాలు చేసుకుంటుందని, కానీ స్వయంసేవకులు అలా ఆలోచించక, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అనే సంఘ కార్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకుని పలు కార్యక్రమాల యోజన చేశారని తెలిపారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాదులో “100 ఏళ్ళ సంఘ్ యాత్ర – కొత్త ఆశయాలు” పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకూ పాల్గొన్న వివిధ రంగాల మేధావులను ఉద్దేశించి డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగించారు. అంతకు ముందు హైదరాబాదులో సీనియర్ బ్యూరోక్రాట్స్, సినీరంగ ప్రముఖులతో సమావేశమై RSS వందేళ్ళ ప్రస్తానం, లక్ష్యం, ఆశయాలు వంటి పలు అంశాలను తెలియజేశారు.
గత పది, ఇరవై ఏళ్లలో సంఘ కార్యం ఎంతో విస్తరించిందని తెలియజేస్తూ సంఘ్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, సంఘ్ లాంటి పని సమాజంలో మరొకటి లేదని ఒకవేళ పైపైన అర్థం చేసుకుంటే తప్పుగా కూడ అర్థం కావొచ్చని అప్రమత్తం చేశారు. అందుకే, సంఘ్‌లో భాగం కావడం ద్వారానే సంఘ కార్యాన్ని అర్థం చేసుకుని అనుభవాన్ని పొందాలని అన్నారు. “సంఘ్ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం చేయడం. ఇదే ముఖ్యమైన పని. దీని మీదే ధ్యాస సంఘ్ ఉంచుతుంది. ఏ వ్యక్తినైతే నిర్మాణం చేస్తామో, ఆ వ్యక్తి అలాగే ఉండాలి కూడా. ఈ కార్యం ఎక్కువ సమయం తీసుకునేది, అలాగే కేంద్రీకృతంగా జరిగే పని. అందుకే వ్యక్తి నిర్మాణం అన్న ఒకే ఒక విషయంపై కేంద్రీకృతమై, సంఘ్ పనిచేస్తోంది. ఈ పని తప్ప, మరో పని చేయాల్సిన అవసరం సంఘ్‌కి లేదు” అని స్పష్టం చేశారు.
RSS స్వయంసేవకులు దేశవ్యాప్తంగా ఒక లక్షా ముప్పై వేలకు పైగా చిన్నా పెద్ద సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారని, సమాజం నుంచి కూడా సహాయాన్ని తీసుకోగా మిగిలిన కార్యం కోసం అవసరమైనవి వారే భరిస్తూ పని కూడా పూర్తి చేస్తారని సంఘ కార్యశైలిపై అవగాహన కల్పించారు. “సంఘ్ సేవా సంస్థ కాదు. సంఘ్ స్వయంసేవకులు పథ సంచలన్ చేస్తారు. అచ్చు మిలటరీ తరహాలోనే క్రమశిక్షణగా చేస్తారు. కానీ సంఘ్ పారా మిలటరీ ఆర్గనైజేషన్ కాదు. నిత్య శాఖలో లాఠీ శిక్షణలాంటివి ఇస్తారు. కానీ ఇదేమీ శారీరిక్ అఖాడా కాదు. అలాగే సాంఘీక్ గీత్, వ్యక్తిగత గీత్‌తో పాటు బ్యాండ్ కూడా ఉంటుంది. కానీ సంఘ్ సంగీత సంస్థ కాదు. పైపై మాటలను చూసి, సంఘ్‌ను అర్ధం చేసుకుంటే తప్పుగా అర్థమవుతుంది” అని సంఘ కార్యాచరణను మోహన్ భాగవత్ పరిచయం చేశారు.
సంఘ్ స్వయంసేవకులు చాలా పనులు చేస్తున్నారని తెలియజేస్తూ.. కళారంగం మొదలు రాజకీయ క్షేత్రం వరకూ అన్ని రంగాల్లోనూ స్వయంసేవకులు ఉన్నారని, కొందరు స్వయంసేవకులు స్వయంగా ఆ రంగాలను నడుపుతుంటే, మరికొందరు ఎప్పటి నుంచో ఉన్న రంగాల్లో భాగస్వాములై నేడు అగ్రభాగంలో ఉన్నారని RSS సర్సంఘ్చాలక్ వెల్లడించారు. వీరిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంఘ్ నియంత్రించదని, పూర్తి స్వయంప్రతిపత్తితో వారు పనిచేస్తుంటారని వివరించారు. సంఘ్ భావజాలంతో, సంఘ్ ఇచ్చిన సంస్కారాల ఆధారంగా ఆ పనులన్నీ చేసేది స్వయంసేవకులే అయినప్పటికీ ఈ పనులన్నింటినీ చూడటం ద్వారా ఎవరూ సంఘ్‌ని అర్థం చేసుకోలేరన్నారు. స్నేహం, ప్రేమ ఆధారంగానే సంఘ కార్యం నడుస్తుందని, ఇచ్ఛాపూర్వకంగా, వివేకంతో స్వయంసేవకులు పనులు చేస్తారని చెప్పారు.
దేశాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రజల కోసం పనిచేసే కొన్నిసంస్థలు లేదా కొందరి పనే మాత్రమే అని అనుకుంటారని, అయితే ఈ స్వభావాన్ని మార్చి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని ఉద్బోధించడమే సంఘ్ పని అని RSS దృష్టికోణాన్ని డాక్టర్ మోహన్ భాగవత్ వివరించారు. పార్టీలు, ప్రభుత్వాలు, నేతలు, మహా పురుషులు పోషించేది సహాయక పాత్ర మాత్రమేనని, సమాజమే యజమాని అని తేల్చి చెప్పారు. సమాజంలో ఏకత, గుణాత్మకత వచ్చేవరకూ దేశ భవితవ్యం మారదని, మారకుంటే మనం ప్రమాదంలో పడినట్లేనని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యక్తి నుంచి వ్యవస్థ వరకూ దేశ సమగ్ర ఉన్నతి లక్ష్యంగా సంఘ్ ఆశిస్తున్న పంచ పరివర్తన్ గురించి వివరించారు. ఇందులో భాగాలైన 1.కుటుంబ ప్రబోధన్ (భజన్, భోజన్, భాష, భూష, భవన్, భ్రమణ్) 2.పర్యావరణ పరిరక్షణ 3.సామాజిక సమరసత 4.స్వదేశీ 5. పౌరవిధుల గురించి పరిచయం చేశారు.
నేడు హిందూ సమాజంలో తాము హిందువులమని గర్వించేవారు, హిందువులమని వ్యక్తిగతంగా మాత్రమే అంగీకరించేవారు, హిందువుగా జీవిస్తున్నప్పటికీ బయటకు వ్యక్తం చేయనివారు, అసలు హిందువులమన్న మూలాలనే మరచినవారు… ఇలా భిన్న వర్గాలున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్ తెలియజేశారు. అందరమూ ఒకే సంస్కృతికి చెందినవారం కాగా, అందరిలోనూ ఉమ్మడిగా ఈ చైతన్యం మేల్కొనేలా చేయడం నేడు సమాజం ముందున్న బాధ్యత అన్నారు. సంఘ కార్యం గురించి వివరించిన ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహన్ భాగవత్ సభికుల ప్రశ్నలకు బదులిచ్చారు. RSS గురించి, RSS ప్రేరిత సంస్థలు, సంఘ్‌లో మహిళల పాత్ర, హిందుత్వం, మతం, ధర్మం, సంస్కృతి, అంతర్గత సమస్యలు, కులవ్యవస్థ, సామాజిక సమరసత, యువతరం పాత్ర, స్వదేశీ, విద్య, కుటుంబం, దేశ భద్రత, జనాభా మార్పులు, భారత్‌తో ముడిపడిన అంతర్జాతీయ అంశాలు, దేశ నిర్మాణం, సమాజ సంబంధంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ మోహన్ భాగవత్ జవాబులిచ్చారు.
సంఘ్ కార్యంలో భాగస్వాములు కావడమెలా అన్న ప్రశ్నకు బదులిస్తూ సమీపంలోని సంఘ శాఖ లేదా సంఘ ప్రేరిత సంస్థల ద్వారా నేరుగా ఆ పని చేయవచ్చని, అయితే సంఘ్ చేసే పనిని వ్యక్తిగతంగా చేస్తున్నవారు కూడా అంతే గౌరవనీయులంటూ తనను సంఘ్ ప్రేరితునిగా పేర్కొన్న భూదానోద్యమ మూలపురుషులు వినోభా భావేని డాక్టర్ మోహన్ భాగవత్ ప్రస్తావించారు. భారత్ – అంతర్జాతీయ సంబంధాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ మోహన్ భాగవత్ స్పందిస్తూ ఏ దేశమైనా తమ జాతీయ ప్రయోజనాల మేరకే అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహిస్తుంటుందని, భారత్ కూడా ఈ విషయంలో రాజీలేని ధోరణినే అవలంబించాలని అన్నారు. అంతర్జాతీయ పరిణామాలతో వ్యవహరించాలంటే ఏ దేశమైనా ఆర్ధికంగా, సామాజికంగా శక్తిమంతమై ఉండాలన్నారు. ప్రపంచంలో ఎంత అలజడి ఉన్నప్పటికీ మన దేశంలో సామాజిక బాధ్యతతో కూడిన బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా వాటి ప్రభావం మనపై అత్యల్పమన్నారు.
అంతర్గత భద్రతా సవాల్ విసురుతూ భారత్‌లోకి జరుగుతున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాట్ల గురించి అడిగిన ప్రశ్నకు అక్రమంగా వచ్చినవారిని గుర్తించడం, నిర్బంధించడం, తిప్పిపంపడం ప్రభుత్వ విధులే అయినప్పటికీ, పౌరులు సైతం బాధ్యతతో వ్యవహరించి ఇలాంటివాటిని అధికారులు, భద్రతా వ్యవస్థల దృష్టికి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళేందుకు సమాజ పరివర్తన జరగాలని, ఇందుకు అందరి సహాయ సహకారాలు కావాలని హైదరాబాద్ కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ మోహన్ భాగవత్ గారిని కలుసుకున్న వివిధ రంగాల ప్రముఖులు, మేధావులను ఆయన కోరారు. సమాజాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న ప్రముఖులు, ఆదర్శ వ్యక్తులు స్వయంఉదాహరణగా నిలిచి తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇటువంటివారిని చూసి సమాజం మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.



