ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి రోజా విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రభుత్వం లో మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద విపరీతంగా నోరు పారేసుకునే రోజా .. గత కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే రోజాకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగింది అన్నమాట వినిపిస్తోంది. తాజాగా రోజా సోషల్ మీడియా అకౌంట్ లలో వైసిపి జెండాలు జగన్ ఫోటోలు తీసేయడం చర్చనీయాంశం అయింది.
అసలు రోజా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోటే మొదలైంది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేస్తూ పేరు తెచ్చుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలు పదవి అప్పగించడం జరిగింది. తర్వాత ఆపరేషన్ ఆకర్ష లో భాగంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నారు. ఈలోగా వైయస్సార్ మరణంతో ఆమె అడుగులకు బ్రేక్ పడింది. ఈ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం నాయకత్వం వెంటనే రోజాను పక్కకు పెట్టేశారు.
దీంతో వైసీపీ పార్టీలో చేరిన రోజా అక్కడ బలంగా నిలదొక్కుకున్నారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలుపు సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలుగుదేశం మీద విపరీతమైన విమర్శలు చేస్తుండటంతో టిడిపి నాయకత్వం సీరియస్ అయింది. అసెంబ్లీ నుంచి అవమానకరంగా నిషేధం విధించి పంపించేశారు.
2019 లో మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా ఆ తర్వాత చెలరేగి పోయారు. తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ని విపరీతమైన పదాలతో తిట్టిపోస్తూ దూసుకుని పోయారు. దీంతో ఆమెకు మంత్రి పదవితో పాటు పార్టీలో పట్టు కూడా బాగా పెరిగింది.
ఇప్పుడు వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం తనదైన స్టైల్ లో పావులు కదుపుతోంది. చంద్రబాబు లోకేష్ మీద విచ్చలవిడిగా తిట్టిపోసిన రోజా మీద కేసులను తిరగతోడుతున్నారు. దీంతో భయపడి పోయిన రోజా నోటికి తాళం వేశారు .
కేసు ల విషయంలో పార్టీ నుంచి ఆశించినంత మద్దతు రాలేదని రోజా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం క్రితం రాఖీ పండుగ రోజు వైయస్ జగన్కు గతంలో రాఖీ కట్టినప్పుడు తీసుకున్న ఫోటోని రోజా సోషల్ మీడియాలో పనిచేశారు. ఆ తర్వాత నుంచి పెద్దగా పోస్టులు పెట్టలేదు కానీ తాజాగా సోషల్ మీడియాలో వైసీపీ జెండా పార్టీ ఫోటోలు తీసేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు ఆమె వైసీపీ మీద అలిగిన ప్రయోజనం లేదు. గతంలో ఆమె చేసిన విమర్శల కారణంగా తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేర్చుకునే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువుగా నిలిచిన రోజను బిజెపి కూడా తీసుకోకపోవచ్చు. అటు కాంగ్రెస్ కమ్యూనిస్టులు దగ్గరికి వెళ్లి ఉపయోగం లేదు. దీంతో తప్పనిసరిగా వైసీపీలోనే కొనసాగాలి.