దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయాలకు రావడంపై మినహాయింపు ఇచ్చింది. అదే సమయంలో సిబ్బంది ఆఫీస్ కు వచ్చేందుకు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు రెండు సమయాలను నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 5.30 గంటలకు, పొద్దున పదింటికి వచ్చిన వారు సాయంత్రం 6.30 గంటలకు వెళ్లాలని ఆదేశించింది.
కార్యాలయాల్లో జరిగే సమావేశాలను వీలైనంత మేరకు వీడియో సమావేశం విధానంలో నిర్వహించాలని సూచించింది. ఆఫీసులకు వచ్చే సందర్శకులతో భేటీ అవడం అత్యవసరం, తప్పనిసరి అయితే తప్ప విరమించుకోవాలని తెలిపింది. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం సహా కార్యాలయాల్లో కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు అంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
అటు దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే 578 కేసులున్నాయి.తరువాత ఢిల్లీలో అత్యధికంగా 382 మంది బాధితులున్నారు. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే.. అందులో 799 మంది కోలుకున్నట్లు తెలిపారు అధికారులు. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది.
కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా వైరస్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసింది.
డిల్లీ ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం రాత్రి పదిగంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
సోమవారం 24 గంటల్లో 4,099 కొత్త కేసులు, ఒక మరణం నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. జనవరి నెల సగం నాటికి ఢిల్లీలో రోజుకు 20 నుంచి 25 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఢిల్లీలో ఇప్పటికే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. సినిమా హాళ్లు, జిమ్‌లు మూసివేయబడ్డాయి. అదే విధంగా దుకాణాలు బేసి-సరి ప్రాతిపదికన అనుమతిస్తున్నారు.
ఇక మహారాష్ట్రలో దేశంలోనే అధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మరో మంత్రి ఏక్ నాథ్ షిండేకు కరోనా సోకింది. ఇప్పటికే 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు రెండ్రోజుల క్రితం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలో 11,877 కొత్త కరోనా కేసులు వచ్చాయి. అంతకు ముందు రోజు 8,063 కేసులు రాగా.. సోమవారం 27 శాతం కేసులు పెరిగాయి.
పంజాబ్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో పలు ఆంక్షలు అమలుచేస్తోంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేసింది. అయితే ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చెన్ని నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం కొత్త ఆంక్షలను ప్రకటించింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలను మూసివేయాలని, అన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించింది. మెడికల్, నర్సింగ్ కళాశాలలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. బార్లు, సినిమాహాళ్లు, మల్టిప్లెక్సెస్, మాల్స్, రెస్టారెంట్స్, మ్యూజియంలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందితో 50 శాతం ఆక్యుపెన్సీతో పనిచేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు జనవరి 15 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే అనుమతించాలని ఈ ఆంక్షల్లో పేర్కొంది. స్టేడియం, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలని, కేవలం జాతీయ, అంతర్జాతీయ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు మాత్రం శిక్షణ తీసుకోవచ్చని తెలిపింది. కాగా, పశ్చిమ బెంగాల్ లో మాజీ కేంద్ర మంత్రి, టిఎంసి నేత బాబుల్ సుప్రియో మూడోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు.