తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త గేమ్ కి తెర తీశారు. ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీని దోషిగా నుంచే పెట్టేందుకు వేగంగా పావులు కదిపారు. తెలంగాణ సమాజంలో గొడవలకు అల్లర్లకు గులాబీ పార్టీ పాల్పడుతూ ఉంటుంది అని లెక్క తేల్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. కానీ ఇందుకోసం ఎంచుకున్న టైము రాంగ్ టైం అని విశ్లేషకులు చెబుతున్నారు.
గులాబీ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పించింది. ఇంతవరకు బాగానే ఉంది శాసనసభలోని సాంకేతిక నిబంధనలను అడ్డుపెట్టి ఈ గేమ్ ప్లే చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సన్నిహితుడికి క్యాబినెట్ మంత్రి హోదా దక్కింది మరియు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఐదు సంవత్సరాలకి గోడ కట్టేసుకున్నారు.
కానీ ఇక్కడే హరీష్ రావు పొలిటికల్ గేమ్ ప్లే చేస్తారు. కౌశిక్ రెడ్డిని ముందుకు జరిపి ఆవేశపూరితంగా ప్రకటనలు ఇప్పించారు. సహజంగానే ఆవేశపరుడు అయిన అరికెపూడి గాంధీ దీని మీద రెచ్చిపోయారు. మనుషుల్ని వెంట వేసుకుని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయి ధర్నాకు దిగారు. దీంతో రెండు వైపుల నుంచి గడబిడ మొదలైపోయింది. దీంతో బిఆర్ఎస్ పార్టీ అన్ని వైపుల ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు అరికెపూడి ఇంటి దగ్గరికి వెళ్లి తేల్చుకుందాం అంటూ బహిరంగ ప్రకటనలు చేశారు . ఇది పూర్తిగా రాజకీయ స్కెచ్ అనటంలో ఎటువంటి అనుమానం లేదు.
ఈ ట్రాప్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఆవేశంగా కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోవడంతో పాటుగా, బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి ఆందోళనలకు దారి తీస్తోంది.
వాస్తవానికి హైదరాబాద్ అంతట ఇప్పుడు గణేష్ నిమజ్జనం హడావుడి నడుస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో నాలుగో వంతు పోలీసు సిబ్బందిని దీనికోసం ఉపయోగించాల్సి వస్తుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లోనూ సిబ్బందికి ఊపిరాడినంత పని ఉంటుంది. ఇదే సమయంలో నగరంలో శాంతిభద్రతల గొడవ చెలరేగినట్లయితే పోలీసుల సిబ్బందికి కత్తి మీద సాములా మారుతుంది. ఈ రెండు రోజుల్లో ఈ గొడవల్లో ఉరుకులు పరుగులు చేసినట్లయితే సోమ, మంగళవారాల్లో వినాయక నిమజ్జనం అన్నది సాహసంతో కూడిన విషయంగా మిగిలిపోతుంది.
మొత్తం మీద హరీష్ రావు తెలివిగా పావులు కదపడంతో ఇప్పుడు శాంతిభద్రతలు అనేది కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి సరైన గేమ్ మొదలుపెట్టినప్పటికీ రాంగ్ టైంలో మొదలుపెట్టడం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.