స్వాతంత్రం తెచ్చింది తామే అని కాంగ్రెస్ పార్టీ పదే పదే గొప్పలు చెప్పుకుంటుంది. వాస్తవానికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసేసి, ఇందిరాగాంధీ పెట్టుకున్న కొత్త కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యం ఏలుతోంది. ఇది వేరే కథ కానీ, అంతకు మించి స్వాతంత్ర పోరాటంలో కూడా నాటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అనేక మంది యోధులు తమ జీవితాలను అర్పించారు. ముఖ్యంగా కొందరు విప్లవ వీరులు పాతిక ముప్పై సంవత్సరాల వయస్సులోనే తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి విప్లవ వీరుల పోరాటం బ్రిటీష్ వారి మీద తీవ్రమైన ఒత్తిడి పెంచింది. అటువంటి యోధులలో ఉధమ్ సింగ్ ముఖ్యులు.
బ్రిటిష్ పాలన ఒక పీడకల
బ్రిటీష్ పాలన అంటే నే ఒక దోపిడీ వ్యవస్థ. భారతదేశాన్ని రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా, సాంస్కృతికంగా, మానవీయంగా కూడా తీవ్రంగా దోచుకున్నారు. భారతీయ వ్యవసాయ వ్యవస్థను దెబ్బతీసి, రైతులను పేదరికంలోకి నెట్టేశారు. పారిశ్రామిక ఉత్పత్తిని నాశనం చేసి, బ్రిటన్ నుండి వస్తువులను దిగుమతి చేసేవారు. వాణిజ్య ఆపద్ధర్మం పేరుతో స్థానిక వాణిజ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. భారతీయులపై వివక్ష ను అమలు చేశారు. 1919లో వచ్చిన రౌలట్ చట్టం ద్వారా భారతీయుల స్వేచ్ఛను హరించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల మీద అనేక చోట్ల హింసాకాండను ప్రయోగించారు. ఇందులో ముఖ్యమైనది జలియన్ వాలాబాగ్ సంఘటన.
దారుణమైన హింసకు వేదిక జలియన్ వాలాబాగ్
పంజాబ్ పట్టణంలో స్థానిక ప్రజలు ఒక మైదానంలో శాంతియుతంగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ మైదానంకు ఉండే గేట్లను మూయించివేసిన సైనిక అధికారి జనరల్ డయ్యర్ రాక్షస రూపంలోకి మారిపోయాడు. అన్ని వైపుల నుంచి నిరాయుధులైన అమాయకులైన ప్రజల మీదకు కాల్పులు జరిపించాడు. ఒకరు ఇద్దరూ కాదు పిల్లా పెద్ద తేడాలేదు. వేల మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపించేశాడు. అటువంటి డయ్యర్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు సరికదా, అతడ్ని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రశంసలతో గౌరవించింది. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటన దేశ ప్రజానీకాన్ని శోకసంద్రంలో ముంచింది. అప్పటి క్షణం నుంచే యువకుడు ఉధమ్ సింగ్ తన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు – “ఇదే నా మార్గం – దానికి ప్రతీకారం అవసరం”. జనరల్ డయ్యర్ కు మరణం అన్నది రుచి చూపించాలని స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాడు.
ఉధమ్ సింగ్
విప్లవ వీరుడు ఉధమ్ సింగ్ డిసెంబర్ 26, 1899, పంజాబ్ రాష్ట్రంలోని సునామ్ గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథాశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. యువ ప్రాయం లోనే స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితుడై ఎన్నెన్నో పోరాటాల్లో పాలు పంచుకున్నాడు. తర్వాత తన లక్ష్యం కోసం విదేశాలకు వెళ్లి వివిధ దేశాల్లో పని చేశాడు. అమెరికాలో గదర్ పార్టీతో, బ్రిటన్ లోని హిందూ స్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తో సంబంధం పెంచుకున్నాడు.
ఉధమ్ వ్యూహం, పోరాటం
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ను ఉధమ్ ఏర్పాటు చేసుకున్నాడు. జలియన్ వాలాబాగ్ నరమేఘానికి ప్రతీకారం తీర్చుకోవడం జీవితలక్ష్యంగా మార్చుకున్నాడు. దీన్ని సాధించేందుకు అనేక సంవత్సరాలు పాటు ఓర్పుతో, అజేయ సంకల్పంతో పని చేశాడు.1920లలోనే బ్రిటన్ వెళ్ళాలన్న ఆలోచన తో అమెరికాలో జీవితం ప్రారంభించాడు. అక్కడ గదర్ పార్టీ మార్గదర్శకత్వం పొందాడు. ఆ తరువాత, వేర్వేరు దేశాలలో పని చేస్తూ చివరకు బ్రిటన్‌కి చేరుకున్నాడు. అక్కడ రహస్యంగా తన ప్రణాళికను అమలు చేయటం మొదలు పెట్టారు.
డయ్యర్ కోసం వేట
ఆ తర్వాత జనరల్ డయ్యార్ కోసం వేట ను మొదలు పెట్టాడు. తప్పుడు పత్రాలు, డాక్యుమెంట్ల సాయంతో మైఖేల్ డయ్యార్ పాల్గొనే ఒక సార్వత్రిక సమావేశానికి ముందే ప్రవేశం పొందాడు.అంతకుముందే తుపాకీ కాల్చటంలో బాగా శిక్షణ పొందాడు. గురి తప్పకుండా కాల్చటంలో నైపుణ్యం సంపాదించాడు. 1940 మార్చి 13న, లండన్‌లోని కైక్స్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు రివాల్వర్లతో తన లక్ష్యాన్ని సుదీర్ఘంగా గమనించి, నిర్ద్వందంగా కాల్చి హతమార్చాడు.డయ్యర్ ను కాల్చి చంపాక, హుందాగా అక్కడ పోలీసులకు లొంగిపోయాడు. తనను అరెస్ట్ చేసిన పోలీసులకు, కోర్టులో కూడా ఎంతో ధైర్యంగా, తన చర్యకు తాను ఎంతగా గర్విస్తున్నానో చెప్పాడు. “నా చర్య తప్పు కాదు. అది నా దేశపు అవమానానికి ప్రతీకారం. మానవత్వాన్ని హరించిన వారికి శిక్ష అవసరం.” అని కోర్టులో స్పష్టంగా తెలియ చెప్పాడు.
విప్లవవాద మార్గం
భగత్ సింగ్, ఉధమ్ సింగ్ లాంటి విప్లవవీరులది వేగవంతమైన నిరసన మార్గం. ఈ రెండు మార్గాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి – స్వాతంత్ర్యం.భగత్ సింగ్ ప్రభావంతో విప్లవవాద మార్గాన్ని ఉధమ్ సింగ్ ఎంచుకున్నాడు. విదేశీ విప్లవ సంఘాలలో శిక్షణ పొందిన ఉధమ్, తన లక్ష్యాన్ని సాధించేందుకు శక్తి వినియోగం అవసరమని నమ్మాడు.తన పేరును రామ్ మహ్మద్ సింగ్ ఆజాద్‌గా ప్రకటించి, దేశంలోని మత ఐక్యతకు నిదర్శనంగా నిలిచాడు. డయ్యర్ హత్య ను అవమానంగా భావించిన బ్రిటీష్ ప్రభుత్వం కేవలం నాలుగు నెలల్లోనే విచారణ ముగించి ఉధమ్ సింగ్ ను దోషిగా నిర్ధారించి మరణ శిక్షను విధించింది. జూలై 31, 1940 పెంటన్విల్ జైలు దగ్గర ఆయనకు మరణ శిక్షను అమలు చేశారు.
అప్పటి కాంగ్రెస్ నాయకులు ఈ మరణ శిక్షను ఆపేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టలేదు. ఇది దేశ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం కలిగించింది. కనీసం స్వాతంత్రం వచ్చాక కూడా తొలినాళ్లలో ఆయన పట్ల గౌరవ భావం ప్రకటించలేదు. దీని మీద పంజాబ్ ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. దీంతో స్వాతంత్రం వచ్చిన పాతికేళ్ల తర్వాత అంటే,, 1974లో ఉధమ్ సింగ్ శరీరావశేషాలను బ్రిటన్ నుండి భారత్‌కు రప్పించి పంజాబ్‌లో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అక్కడ పాఠ్య పుస్తకాలలో ఆయన జీవిత చరిత్రను చేర్చారు. తాజాగా కొందరు ఔత్సాహికులు షాహీద్ ఉధమ్ సింగ్ పేరుతో సినిమాలు, డాక్యుమెంటరీలు నిర్మించారు.
ఉధమ్ సింగ్ జీవితం మనకు ఆదర్శనీయం. ఆయన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి దేశానికి అంకితం చేశాడు. యువతలో దేశభక్తి, సమర్పణ భావనను పెంపొందించేందుకు ఆయన జీవితం మార్గదర్శకం. సామాజిక న్యాయం కోసం పోరాడటం, అడ్డంకులను అధిగమించటం, ధైర్యంగా నిలబడటం వంటి విలువలకు ప్రతీక. ఉధమ్ సింగ్ జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. దేశం కోసం చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. ఉధమ్ సింగ్ ఉద్యమం, బలిదానం మన యువతకు స్ఫూర్తి కలిగిస్తుంటాయి. జూలై 31న ఆయన బలిదాన్ దినోత్సవం సందర్భంగా ఉధమ్ సింగ్ సేవలను తలచుకొందాం. ఆయనకు నివాళి అర్పిద్దామ్.