ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కీలక పదవులను భర్తీ చేసేటందుకు పార్టీ అధిష్టానం అనుమతి అవసరం. అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా హస్తినకు వెళుతున్నారు..
నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇప్పటికే కొంతమేర కసరత్తు నడుస్తోంది. కొన్ని కార్పొరేషన్ పదవుల్ని కాంగ్రెస్ నాయకులకు అప్పగించారు . కీలకమైన పదవులు విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు,
మూడు రోజుల ఢిల్లీ టూర్లో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు రాష్ట్రానికి రానున్న బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంచాల్సిందిగా కోరనున్నారు. ఈ నెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్ర గ్రాంట్లను పెంచాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి చర్చించనున్నారు.
పాలనాపరంగా కేంద్రం నుంచి కొంత మద్దతు ఆశిస్తున్నారు.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సీఎంతో జరిగిన సమావేశంలో జరిగిన చర్చల వివరాలను కేంద్ర హోం మంత్రికి వివరించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలపై తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరే అవకాశముంది. డిఫెన్స్ లాండ్స్ కేటాయింపు మొదలు సైనిక్ స్కూలు ఏర్పాటు వరకు అనేక అంశాలను ఈ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు.
పార్టీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి బృందం దఫ దఫాలుగా సమావేశం కానుంది.
రాష్ట్రంలో రుణమాఫీ స్కీమ్ అమలవుతున్న విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నారు. పథకం అమలుకు అవసరమవుతున్న మొత్తం రూ. 31 వేల కోట్లలో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కోసం విడుదల చేసిన రూ. 6,098 కోట్ల గురించి ఆమెకు వివరించనున్నారు. ఈ నెల చివర్లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న విజయోత్సవ సభకు రావాల్సిందిగా రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నారు.
గులాబీ నేతలను కాంగ్రెస్ లోకి ఆకర్షించడం, రైతు రుణమాఫీ అమలు చేసి ఆ క్రెడిట్ ను రాహుల్ గాంధీకి ఇవ్వడం ద్వారా… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర మంచి మార్కులు సంపాదించినట్లు సమాచారం. దీంతో కీలకమైన నామినేటెడ్ పోస్టుల విషయంలో రేవంత్ రెడ్డి మాటే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా రేవంత్ తీసుకెళ్లిన జాబితానే హైకమాండ్ ఆమోదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.