తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త గేమ్ ప్లాన్ మొదలు పెట్టారు. ప్రత్యర్థి పార్టీ బీ ఆర్ ఎస్ పార్టీ లో చీలికలు తెచ్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ కుటుంబ పెద్దల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య తగువులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి మాటలు వింటే ఈ విషయం తేలిక గా అర్థం అవుతుంది.
అసెంబ్లీ సమావేశాల సమయంలోనే.. హఠాత్తుగా ఔటర్‌రింగ్ రోడ్డు లీజు టెండర్ల అంశం తెరపైకి రావడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఔటర్ రింగ్ రోడ్డును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 7వేల కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికీ దారితీస్తోందోనన్న చర్చ జరుగుతోంది. హరీశ్‌రావు కోరిక మేరకే ORR టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత రెడ్డి ఆంతర్యమేంటనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
నిజం చెప్పాలంటే.. కొంత కాలంగా… వరుస ఎదురుదెబ్బలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న కారు స్టీరింగ్‌ను కేటీఆర్ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంతలో ఈ-కారు రేస్ కేసు స్పీడ్ బ్రేకర్లా అడ్డొచ్చిపడింది. ఈ-కారు రేసును మించిన వేగంతో కేసు దర్యాప్తు మొదలైంది.. కేటీఆర్‌ను A1గా చేర్చి FIR నమోదు చేసింది ఏసీబీ. మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ పంపించింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కేటీయార్ ను అరెస్ట్ చేయించి, ఆ పాపం అంతా హరీశ్ దే అన్నట్లుగా నెట్టేయాలి అన్నది రేవంత్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. అందుకే
కేటీయార్ కు, హరీశ్ రావుకి మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారు. దీనికి కారణం ఏమిటంటే.. ఔటర్‌రింగ్ రోడ్డు లీజ్ టెండర్లు జరిగినప్పుడు.. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల తీగ లాగితే.. అది మళ్లీ కేటీఆర్‌కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.
కొంత కాలంగా అసెంబ్లీ లో హరీశ్ రావు దూకుడు పెంచుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఇంట్లోనే కుంపటి రాజేయాలి అన్నది రేవంత్ ప్లాన్ లా కనిపిస్తోంది. ఇందుకోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అర్థం అవుతోంది.