95 ఏళ్లంటే ఎవరైనా కృష్ణా..రామా.. అనుకుంటూ ఇంట్లో కూర్చుంటారు కానీ చిలుకూరి శాంతమ్మ మాత్రం పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అదికూడా రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. ఆమె స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం. 1929 మార్చి 8న జన్మించారు. ఆమె తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. ఆవిడ ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. శాంతమ్మ అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో పాఠశాల విద్యాభ్యాసం చేశారు. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు . ఆంధ్రా యూనివర్సిటీ నుంచి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరారు. లెక్చరర్ నుంచి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో పదవీ విరమణ చేశారు. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలని.. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరారు.
ఈమె ప్రస్తుతం విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్శిటీలో రెండు కర్రల సాయంతో నడుస్తూ విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోదిస్తున్నారు. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు శాంతమ్మ.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో తెలుగు రాష్ట్రాలలో తొలితరం స్వయంసేవక్ లలో ఒకరుగా, ప్రాంత, క్షేత్ర సంఘచాలక్ గా.. కేంద్ర కార్యకారిని సదస్యురాలిగా పలు బాధ్యతలు నిర్వహించి.. వేలాది మంది సంఘ్ కార్యకర్తలకు స్ఫూర్తి కలిగిస్తూ చివరి వరకు సంఘ కార్యంలో నిమగ్నమైన ఆచార్య చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ధర్మపత్ని ఆమె.
“వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు” అని శాంతమ్మ అన్నారు.
శాంతమ్మ విద్యార్ధి దశలోనే.. బ్రిటన్ రాయల్ సొసైటీ ఆచార్యుల పరిశీలనలో డాక్టర్ ఆఫ్ సైన్స్ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. స్పెక్ట్రోస్కోపీలో విశేషమైన పరిశోధనలు చేసి.. ప్రయోగశాలలను అభివృద్ధి చేసిన డాక్టర్ రంగధామారావు మార్గదర్శనంలో పరిశోధనలు చేశారు. లేజర్ టెక్నాలజీ, పెట్రోల్‌లో మలినాలు గుర్తింపు వంటి అనేక అనేక ప్రాజెక్టుల్లో శాంతమ్మ పరిశోధనలు చేశారు. అనేక పరిశోధన పత్రాలు ముద్రించారు. అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియాలోని అనేక వర్శిటీలు శాంతమ్మను ఆహ్వానించి అనుభవాలు తెలుసుకున్నాయి. శాంతమ్మ మార్గదర్శకత్వంలో 17 మంది వరకూ పీహెచ్డీ పూర్తి చేశారు.
రిటైరైన 34 ఏళ్ల తర్వాత కూడా శాంతమ్మ బోధన, పరిశోధన కొనసాగుతూనే ఉన్నాయి. 95 ఏళ్ల వయస్సులో మీకు ఎందుకమ్మా ఇవన్నీ అని ఎవరైనా అంటే ..
“ఆసక్తితోనే భగవద్గీతను అధ్యయనం చేసి తెలుగులోకి అనువదించాను. వేద గణితంలోని 29 సూత్రాలపై ఎన్నో పరిశోధనలు చేసి.. ఏడు సంపుటాలు రాశాను. ప్రస్తుతం క్యాన్సర్ రోగులకు ఉపశమనం లభించే మందుల కోసం పనిచేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని, శక్తిని వృథా చేయకూడదు. ఆ రెండింటి విలువ తెలుసుకుని జీవించాలి” అని అంటారు.
ఆమె దినచర్య ఉదయం 4 గంటలకు మొదలవుతుంది. ఉదయాన్నే లేచి విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటారు
. అక్కడి సెంచూరియన్ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటారు . చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు ఆమె దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్ ఆవిడే అని.. గిన్నిస్‌బుక్ వాళ్లకు తన పేరును సూచిస్తానని వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు ఈ మధ్యనే అన్నారని తెలిపారు.
విశాఖపట్నంలో సంఘ కార్యకర్తలందరిని ఆమె ఆదరించేవారు. ఆడవాళ్లు ఇంకా ఎక్కువగా వాహనాలు నడపడం లేని రోజులలోనే ఆంధ్ర యూనివర్సిటీలో అందరికన్నా వేగంగా కారు నడుపుతూ ఉండేవారు. నిజాయితీకి, వృత్తిపట్ల అంకితభావంకు, సమాజం పట్ల బాధ్యతాయుత ప్రవర్తనకు ఆమె పేరొందారు.