ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మతం ఆధారంగా రిజర్వేషన్లు తప్పు అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీనిమీద కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 నుంచి 77 సామాజిక వర్గాలకు ఓబీసీ హోదాను కల్పించింది. వీటిలో అత్యధికం ముస్లిం మతానికి చెందిన వర్గాలు. ప్రభుత్వ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. ‘ఈ సామాజిక వర్గాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతం ఒక్కటే ఏకైక ఆధారంగా కనిపిస్తున్నది’ అంటూ హైకోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిమీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ సూత్రప్రాయంగా ముస్లింలు రిజర్వేషన్లకు అర్హులు కాదా అని వ్యాఖ్యానించగా, ‘మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు’ అని జస్టిస్ గవాయి బదులిచ్చారు.ఈ రిజర్వేషన్ మతం ఆధారంగా ఇచ్చింది కాదని, వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిందని కపిల్ సిబల్ పేర్కొన్నారు. హిందువులకు సైతం వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఉందని తెలిపారు. రంగనాథ్ కమిషన్ కూడా ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించిందని, వీటిలో చాలా వర్గాలు కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.
హైకోర్టు తీర్పు కారణంగా 12 లక్షల మంది ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయని, వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల హక్కులను హైకోర్టు నిర్ణయం ప్రభావితం చేస్తున్నదని, హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఈ వాదనల మీద ప్రతివాదుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయకుండా, బీసీ కమిషన్ను సంప్రదించకుండా రిజర్వేషన్లు కల్పించిందని ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది పత్వాలియా వాదించారు. మైనార్టీల ఓట్ల కోసం అడ్డదారిలో రిజర్వేషన్లు ఇచ్చారని వివరాలు చూపించారు.
దీనిమీద విచారణను సుప్రీంకోర్టు జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.