లక్షరూపాయలకు మించి అమ్ముతుండడం, కృత్రిమ కొరత, బ్లాక్ లోఅమ్మకాల వార్తల నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఇంజక్షన్ల వినియోగం, ఉపయోగాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా పంజా విసురుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత,బెడ్స్ కొరత, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత వెంటాడుతోంది. దీంతో రెమ్డెసివిర్ కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో మార్కెట్లో కొన్ని శక్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ.. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అంతేకాదు..ఔషధానికి విపరీతమైన కొరత ఉందని.. సరఫరా పెంచాలని అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలనుంచి కేంద్రానికి అభ్యర్థులు వెళ్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఆ ఇంజక్షన్ ప్రాణాలు నిలబెట్టే సంజీవని కాదని ప్రకటించింది. ఇంజక్షన్ సామర్థ్యం, వాడపై స్పష్టతనిస్తూ…అనవసరంగా వాడవద్దంది.
జాతీయ కోవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడైన ఎయిమ్స్ (AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా సైతం ఈ విషయంపై స్పందించారు. రెమ్డెసివిర్ మరణాలను ఇది తగ్గించదని…మరో మంచి యాంటీవైరల్ డ్రగ్ లేనందువల్ల వాడాల్సి వస్తోందని అన్నారు. అయితే ఆసుపత్రుల్లో చేరి, ఆక్సిజన్ సిలిండర్ పై ఉన్నవాళ్లకు మాత్రమే ఇది కాస్త పనిచేస్తుంది తప్ప… సాధారణ యాంటీబయోటిక్ లా దీన్ని వాడవద్దని వివరించారు.