మతమార్పిడి కోసం రెండు ప్రాణాలను బలి పెట్టారు. మత మార్పిడి ముఠా చేష్టల వల్ల ఇద్దరి యువకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. నదిలో లోతు ఉంటుంది, అటు వైపు వెళ్లవద్దని స్థానికులు వారించారు. ఏసు చూసుకొంటాడు ఫర్వాలేదు అని పాస్టర్లు ప్రోత్సహించారు. దీంతో నది మధ్య లో మునిగి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వేమవరం దగ్గర మత మార్పిడిలు చేపట్టారు. బాప్తిజం తీసుకొనేందుకు నదిలో కానీ, చెరువులో కానీ ముంచి కొంత సేపు ఉంచుతారు. ఆ సమయంలో మత వాక్యాలు చదివి పరిశుద్ధుడు అయినట్లుగా లెక్క తేలుస్తారు. ఎప్పటిలాగే 30 మంది గురువారం సాయంత్రం మతమార్పిడి కోసం పెనుమూడిలోని కృష్ణానది వద్దకు వచ్చారు.
నదిలో దిగి బాప్టిజం తీసుకుంటున్న సమయంలో పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్‌బాబు, పెనుమాల హర్షవర్థన్, పెనుమాల రాజా నీటిలో మునిగారు. ఎంతకీ బయటకు రాకపోవటంతో స్థానికులు వెంటనే నదిలో దూకి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు (19), తలకాయల గౌతమ్(18) గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చేపట్టగా కాసేపటి తర్వాత వారి మృతదేహాలు లభించాయి. ప్రాణాలతో బయటపడిన సుధీర్‌బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లెలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన గౌతం ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా, దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు.
ఈ ఎపిసోడ్ లో విచిత్రం ఏమిటంటే..విద్యార్థులు ఇంటి దగ్గర చెప్పకుండానే మత మార్పిడి కోసం వచ్చారు. అంతలోనే చనిపోవటం విషాదాన్ని కలిగించింది. దీనిని బట్టి చాలా మంది విద్యార్థులను ఇంటి దగ్గర తెలియకుండానే మత మార్పిడులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇటువంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
…..