కరోనా కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు…కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు కొంతకాలంగా బాగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. దేశంలో డీ మోనిటైజేషన్ అమలైనప్పటి నుంచే డిజిటల్ లావాదేవీలు పెరగడం మొదలైనా…కరోనా సంక్షోభం సమయంలో విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం చిన్న చిన్న కొనుగోళ్లు డిజిటల్ లావాదేవీలతో నడుస్తున్నాయి. ఫలితంగా ఆన్లైన్ పేమెంట్లు పెరిగాయి. ఆగస్టు నెలలో అన్ని పేమెంట్ యాప్‌ల నుంచి డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 6.39 ట్రిలియన్ రూపాయల మేర చెల్లింపులు జరిగినట్టు…నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. ఆగస్టు నెలలో దాదాపు 3.5 బిలియన్ల లావాదేవీలు యూపీఐ యాప్‌ల ద్వారా జరిగాయి. గత నెలతో పోలిస్తే 9.5 శాతం పెరిగినట్టు.
ఏప్రిల్-మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కాస్త తగ్గినా..మళ్లీ పుంజుకుంది.ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్పేలు టాప్‌లో కొనసాగుతున్నాయి.యూపీఐ ఒక్కటే కాకుండా ఐఎంపీఎస్ ద్వారా ఆగస్టు నెలలో 377 మిలియన్ల లావాదేవీలు జరిగాయని..జూలై నెలతో పోలిస్తే 8.5 శాతం పెరిగిందని తెలుస్తోంది. ఐఎంపీఎస్ లావాదేవీల విలువ 3.18 ట్రిలియన్లుగా ఉంది.ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఆగస్టు నెలలో 201 మిలియన్ల లావాదేవీలు 3 వేల కోట్ల మేర జరిగాయి. భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ ద్వారా 58.88 మిలియన్ల లావాదేవీలు పదివేల కోట్ల మేర జరిగాయి.