అడవి తల్లిని నమ్ముతున్న అసలు సిసలు గిరిజనులకే రాజ్యాంగబద్ధమైన హక్కులు ప్రయోజనాలు దక్కాలి అని ప్రముఖ సామాజికవేత్త రమేష్ భాయ్ అభిప్రాయపడ్డారు. హిందూ గిరిజనులకు మాత్రమే ఈ అవకాశాలు ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. మతం మారిన వారికి సంప్రదాయాల మీద అటవీ సంపద మీద అభిమానం ప్రేమ ఉండదని.. అటువంటివారిని దూరం పెట్టాలి అని ఆయన సూచించారు.
అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం జాతీయ కార్యకర్తల సదస్సు హర్యానాలోని సమల్ఖాలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి రమేష్ భాయ్ తన ఆశీస్సులలో మాట్లాడుతూ మన పని దాన ధర్మం కాదు సాధన అని తెలిపారు. కలిసి జీవించడానికి దేవుడు మనందరికీ జీవితాన్ని ఇచ్చాడని, భాగస్వామ్యంతో జీవితాన్ని గడపాలని సూచించారు.
ఆయన ప్రసంగంలో మూడు సందేశాలు ఉన్నాయి – మనిషి మనిషితో ఎలా ప్రవర్తించాలి, మొత్తం సృష్టి, జీవరాశులతో ఎలా ప్రవర్తించాలి, ప్రకృతితో ఎలా ప్రవర్తించాలి అని వివరించారు. ఈ మూడు చర్యలు మనిషి యాగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని, ఇవి సమాజ సంక్షేమం మరియు దేనిర్మాణానికి సహాయపడతాయని ఆయన తెలిపారు. దేశ సమగ్రత, సమైక్యత చెక్కుచెదరకుండా ఉండాలంటే గిరిజన ప్రాంతాల్లో కథలు, ఉపన్యాసాలు చేయాలని ఋషులు, సాధువులందరికీ కూడా చెబుతూనే ఉంటానని పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ సహ్ సర్ కార్యవహ్ రామ్ దత్ జీ మాట్లాడుతూ 3 సంవత్సరాల తర్వాత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. గిరిజన తెగల మధ్య మన పనిని విస్తృతం చేస్తామంటూ కార్యకర్తలు అందరూ ఇక్కడి నుండి ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. వేదికపై జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య, కల్యాణ్ ఆశ్రమ సత్యేంద్ర సింగ్, ఉపాధ్యక్షులు హెచ్కే నాగు, టెక్కీ గుబిన్, ప్రధాన కార్యదర్శి యోగేశ్ బాపట్, సంస్థ మంత్రి అతుల్ జోగ్, మధ్యప్రదేశ్ గిరిజన సలహా కమిటీ సభ్యురాలు ఊర్మిళా భారతి, హర్యానా యూనిట్ అధ్యక్షుడు రామ్బాబు పాల్గొన్నారు.
అండమాన్ నికోబార్ దీవులు, లడఖ్, జమ్మూకాశ్మీర్, పూర్వాంచల్, దక్షిణ భారత రాష్ట్రాలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి గిరిజన ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వనవాసి కల్యాణ్ ఆశ్రమ కార్యకలాపాలు, కార్యక్రమాలతోపాటు వివిధ అంశాలపై 12 సెషన్లలో చర్చించనున్నారు.
అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం దేశంలోని 17,394 ప్రదేశాలలో అనుబంధ యూనిట్ల ద్వారా గిరిజన సమాజ సర్వతోముఖాభివృద్ధికి విద్య, ఆరోగ్యం, గ్రామాభివృద్ధి, స్వావలంబన మొదలైన 22,152 ప్రాజెక్టులను నడుపుతుంది.
గిరిజనుల సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ ..రాబోయే కాలానికి సంబంధించిన లక్ష్యాలను నిర్ణయాలను ఈ సమావేశంలో నిర్దేశించుకుంటారు.