2017 నుంచి పలుసార్లు మానసిక వికలాంగురాలైన మైనర్ కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మహారాష్ట్రలోని స్పెషల్ పోక్సో కోర్టు ఒక తండ్రి, అతని కుమారుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి కవితా డి షిర్భటే ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో యాక్ట్ ద్వారా తన ఉత్తర్వులో ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించి… కారాగార శిక్ష వేశారు.
భివాండీకి చెందిన 52 ఏళ్ల వ్యక్తి, అతని 25 ఏళ్ల కుమారుడు.. 15 ఏళ్ల బాధితురాలిపై 2017 నుంచి పలుమార్లు అత్యాచారం చేశారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంజయ్ మోర్ కోర్టుకు తెలిపారు. బాలిక గర్భం దాల్చడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో భివాండిలోని కొంగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
బాధితురాలు సహా తొమ్మిది మంది సాక్షులను విచారించారు. నిందితులిద్దరిపై ఉన్న అన్ని అభియోగాలను ప్రాసిక్యూషన్ విజయవంతంగా నిరూపించిందని, వారిద్దరినీ దోషులుగా నిర్ధారించి శిక్ష విధించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)