శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఆయనపై ప్రజాగ్రహం ఉన్నా…దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనవైపే మొగ్గుచూపారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 225 ఓట్లకు గాను విక్రమసింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి, అయన ప్రధాన ప్రత్యర్థి దులాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు లభించగా.. లెఫ్టిస్ట్ అనురా దిసానాయకు కేవలం మూడు ఓట్లు మాత్రమే లభించాయి. 6 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన అనుభవం రణిల్ విక్రమసింఘేకి ఉంది.
రాజపక్స కుటుంబ పాలనతో విసిగిపోయిన లంక వాసులు.. సోదరులిద్దరూ అధ్యక్ష, ప్రధాని పదవులను నుంచి గద్దె దిగే వరకూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రణిల్ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇటివల చోటుచేసుకున్న పరిణామాలతో రాజపక్సల భాగస్వామిగా ఆయనపై ముద్రపడింది. రాజపక్స కుటుంబ పార్టీ ఎస్ఎల్పీపీ మద్దతిస్తుండడంతో వారి ప్రయోజనాలను విక్రమసింఘే కాపాడుతున్నారని ఆందోళనకారులు విశ్వసిస్తున్నారు.