ప్రముఖ సినీనటి మాజీ ఎంపీ విజయశాంతి కొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. సాధారణంగా బోనాల పండగ వచ్చినప్పుడు బోనం ఎత్తుకోవడం, అమ్మ వారిని దర్శించుకోవడం క్రమం తప్పకుండా చేసేవారు. కానీ ఈ ఏడాది ఈ సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టేశారు. బోనాల పండుగకు పెద్దగా హడావిడి చేయకుండా చిన్న స్థాయిలోనే ముగించేశారు. పండగలకు శుభాకాంక్షలు చెబుతూ గ్రీటింగ్ కార్డులు పెట్టడం తప్ప ఎక్కడ చడీ చప్పుడు లేదు.
బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి చేరిన సీనియర్ తెలంగాణ నాయకులు వివేక్ , రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటివారు..త్వరగానే గాంధీ భవన్లో సర్దుకొని పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అనుబంధం పెంచుకొని పార్టీలో మమేకమైపోయారు. వీరిలో కొందరు పదవులు కూడా దక్కించుకొని పరిపాలనలో దిగిపోయారు.
కానీ, విజయశాంతి మాత్రం అడ్జస్ట్ కాలేకపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచి పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఆ మధ్యన ఒకసారి కిషన్ రెడ్డి మీద, మరోసారి చంద్రబాబు మీద విమర్శలు చేశారు తప్ప.. పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశించినప్పటికీ .. పార్టీ వర్గాల నుంచి స్పందన కూడా కనిపించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల పంపిణీ అయిపోయింది అని చెప్తున్నారు. విజయశాంతి స్థాయికి తగిన పోస్ట్ ఇప్పటిదాకా ఖరారు చేయలేదు అని గాంధీ భవన్ లో టాక్. దీంతో విజయశాంతి కూడా గాంధీభవన్ వైపు వెళ్లడం మానేసుకొన్నారు అని తెలుస్తోంది.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సాంప్రదాయం కనిపిస్తుంది. ప్రభుత్వంలో పదవులు పొందిన వారు ఆయా పేషీల దగ్గర్నుంచి వ్యవహారాలు నడిపిస్తారు. అటువంటి పదవులు దక్కకపోతే మాత్రం గాంధీభవన్ వేదికగా కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. రాములమ్మ కూడా అప్పుడప్పుడు గాంధీభవన్ వస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ నడుస్తూ ఉండేది. కానీ విజయశాంతి పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోవడంతో ఆమె ఊసు ఎక్కడ వినిపించడం లేదు. దీంట్లో నామినేటెడ్ పోస్టులలో విజయశాంతికి అవకాశం ఇస్తారా.. లేదా.. అన్నది ఒక ప్రశ్నగా మారింది.
తెలుగు తమిళం కన్నడం అనర్గళంగా మాట్లాడే విజయశాంతికి ఉత్తరాది హిందీ కొంచెం కష్టం. దీంతో ఢిల్లీ వెళ్లి పార్టీ తరపున లాబీయింగ్ చేయాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ బిజెపి పార్టీలను .. రెండు, మూడు సార్లు చుట్టేసిరావడం మరో రకమైన ఇబ్బందిగా మారింది. ఆమె సొంత నియోజకవర్గం మెదక్ లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతర నాయకులు కుంపటి పెట్టేశారు. దీంతో రాములమ్మకి ఇబ్బందులు పెరుగుతున్నాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే గతంలో ఎంపీగా పనిచేయడం రాములమ్మకు కలిసి వస్తోంది. అప్పట్లో కొందరు నాయకులు పరిచయాలు ఉండడం ఆమెకు లాభదాయకం. పైగా సినిమా గ్లామర్ కూడా కలిసి వచ్చే అంశం. ఢిల్లీ నుంచే పోస్ట్ తెచ్చుకోవాలని రాములమ్మ ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తం మీద పదవి వచ్చేదాకా విజయశాంతి మనం పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే బోనాల పండుగ సందర్భంగా కూడా పెద్దగా హడావిడి చేయకుండా కామ్ గా ఉన్నారు అని అర్థం అవుతుంది.