అయోధ్యలో సిద్ధమవుతున్న భవ్యమందిరంలో కొలువుదీరనున్న రామయ్య విగ్రహం రూపురేఖలు నిర్ణయం అయ్యాయి. మందిరంలో రామయ్య కోదండపాణిగా దర్శనమిస్తాడని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. కర్నాటక నుంచి సేకరించిన కృష్ణశిలతో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలిపింది. మైసూరుకు చెందిన సుప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఈమేరకు ట్రస్ట్ కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల వయసులో ఉన్న శ్రీరాముని విగ్రహం 5 అడుగులు ఉంటుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ట్రస్ట్ ప్రతినిధులు, సాధుసంతులు, శిల్పులు, ధార్మిక వేత్తలు, శాస్త్రవేత్తలతో విస్తృత సమాలోచనల తరువాత కృష్ణశిలతో రామయ్యను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
2020 ఆగస్టులో అయోధ్య ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరకల్లా ఆలయ నిర్మాణం పూర్తిఅవుతుందని ట్రస్జ్ ఇప్పటికే తెలిపింది. అయితే వచ్చే ఏడాది మకర సంక్రాంతి నాటిని గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. శతాబ్దాల పోరాటం, ఎందరో త్యాగాల తరువాత రామజన్మభూమిని హిందువులు సాధించుకున్నారు. దేశప్రజలందరూ ఆలయ నిర్మాణం కోసం నిధి సమర్పణ చేశారు. ఇక మందిరం గర్భగుడిలో కొలువయ్యే రామయ్య ఎలా ఉంటాడోనని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కర్నాటకలోని కార్కర్, హెగ్గె దేవెన్ కోటే గ్రామాల నుంచి సేకరించి అయోధ్యకు తరలించిన కృష్ణ శిలల్లో ఒక శిలను శిల్పి అరుణ్ యోగిరాజ్ ఇప్పటికే ఎంపిక చేసినట్టు ట్రస్ట్ తెలిపింది.