శ్రీ భగవద్రామానుజుల సమతాస్ఫూర్తి సిద్ధాంతాన్ని సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో సమతాస్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సమతామూర్తి పేరిట భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భగవద్రామానుజుల వారు కూర్చున్న భంగిమలోని 216 అడుగుల పంచలోహా విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సోమవారం చినజీయర్‌స్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు.
విద్వేషాలు పెరిగిపోయిన ప్రస్తుత సమాజానికి రామానుజాచార్యుల సమతా సిద్ధాంతం అవసరమని చినజీయర్ స్వామి తెలిపారు. చరిత్రకు వన్నె తీసుకురాగల ఓ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విగ్రహం చూసిన ప్రతి ఒక్కరిలో ఓ జిజ్ఞాస కలిగించి సమతాస్ఫూర్తి పొందేలా భారీ మూర్తిని నెలకొల్పుతున్నట్లు చెప్పారు.
2022 ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ చేయనున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి ప్రకటించారు. ఫిబ్రవరి 14 వరకు సమతామూర్తి కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పాల్గొంటారని చెప్పారు.
రామానుజాచార్యులు సమసమాజ స్థాపనకు పూనుకున్నారని చినజీయర్ స్వామి తెలిపారు. శ్రీరామానుజాచార్యులకు వెయ్యేళ్లు పూర్తయ్యాయని, సమతా సిద్ధాంతాన్ని రామానుజులు లోకానికి చాటారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో 12 రోజుల పాటు రామానుజాచార్యుల ఉత్సవాలు నిర్వహిస్తామని, రూ. 1200 కోట్లు పైగా వ్యయంతో, వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద పంచలోహ విగ్రహం నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 120 కిలోల బంగారంతో నిత్యారాధాన విగ్రహం ఏర్పాటు చేస్తామని, 12 రోజులు రోజుకు కోటి సార్లు నారాయణమంత్రం పఠనం ఉంటుందని పేర్కొన్నారు.
స్ఫూర్తి కేంద్రంలో 12 రోజులపాటు 2 లక్షల కిలోల ఆవు నెయ్యితో 1,035 కుండాలతో హోమాలు నిర్వహిం చనున్నట్లు చినజీయర్‌స్వామి తెలిపారు. వ్యక్తిలో మానసిక స్థైర్యం, ధైర్యం కల్పించేందుకు 12 రోజులపాటు పంచ సంస్కార దీక్షదారులతో ప్రతిరోజూ కనీసం కోటిసార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపింపజేయనున్నట్లు వివరించారు. కోటి అవణ క్రతువు కూడా నిర్వహిస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో 5వేల మంది రుత్వికులు పాల్గొంటారని, 128 యాగశాలలో హోమం చేస్తామని వివరించారు. 1017లో రామానుజాచార్యులు అవతరించి 121 ఏళ్లపాటు భూమిపై ఉన్నారని, ఆయన సమతాస్ఫూర్తిని ఎంతో మంది మేధావులు అంగీకరించారని ఆయన తెలిపారు.
చిన్న వయసులోనే ఆయనలో అద్భుత ప్రతిభాపాటవాలు ఉండేవని, రామానుజాచార్యులు కేవలం పండితులే కాదని అద్భుతమైన ప్రజ్ఞాశాలని, సమతా సిద్ధాంతాన్ని లోకానికి చాటిన మహనీయులని- చినజీయర్ స్వామి తెలిపారు.
స్ఫూర్తి కేంద్రంలో దసరా రోజున 128 యాగశాలల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఒక్కో యాగశాల వద్ద 8 కుండాలతో ఆగమశాస్త్రం ప్రకారం హోమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం 5 వేల మంది రుత్వికుల సేవలు వినియోగిస్తామన్నారు.
విగ్రహావిష్కరణకు 135 రోజుల కౌంట్‌డౌన్ మొదలైందని, నేటి నుంచి విగ్రహావిష్కరణ వరకు ప్రపంచం నలుమూలలా ఉన్న వారు వందే గురు పరంపరా మంత్రాన్ని జపించాలని జీయర్‌స్వామి పిలుపునిచ్చారు. ఇది ఓ ఉద్యమంలా సాగాలన్నారు. రెండు నెలలపాటు నిర్వహించనున్న చాతుర్మాస దీక్షను ప్రారంభించినట్లు చెప్పారు.
అదే విధంగా కరోనా మహమ్మారి నుంచి చిన్న పిల్లల ఆరోగ్య దృష్టి ఉంచుకొని ఆయన చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం ఆయుర్వేద ఔషధాన్ని అందజేశారు. దివ్య సాకేతం కేంద్రంలో సుదర్శన హోమం వంటి కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Courtesy : NijamToday.com