అనంతపురం జిల్లాలో సంచలనం కలిగించిన శ్రీరాముని రథం దగ్ధం కేసు చిక్కుముడి విడిపోయింది. గ్రామంలోని వైసిపి నేతలే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు లెక్క తేల్చారు. గ్రామంలోని విభేదాలతో ఈ తప్పుడు చర్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది.
కొంతకాలంగా రాయలసీమలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి సమయంలో కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథ మండపంలోని రథానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.
రథ మండపం తాళాలను పగులగొట్టి రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. మంటలను గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రథం ముందు భాగం కాలిపోయింది. ఈ ఘటనపై కనేకల్ పోలీసు స్టేషన్ లో ఈ నెల 24న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్, క్ల్యూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి.
గొడవ పెద్దది కావడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా వచ్చి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.
పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి. హనకనహాల్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి అన్నదమ్ములు సుమారుగా రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారు. ఈ రథం తయారుచేసే సమయంలో ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామంలోని ఎవరిని వద్ద చందాలు తీసుకోకుండా స్వయంగా తయారు చేయించారు. దీంతో గ్రామస్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా మరో వర్గం రథాన్ని నిప్పు పెట్టింది.
ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వైసీపీకి చెందిన బొడిమల్ల ఈశ్వర రెడ్డిను అరెస్టు చేశారు.
నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. ముద్దాయి బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీస్ కస్టడీ కి తీసుకొని ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అని విచారణ చేస్తామని చెప్పారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ జగదీశ్ అభినందించారు.
మొత్తం మీద రాజకీయ గొడవల కోసం శ్రీరాముని గుడిలో రథాన్ని దగ్ధం చేయడం మీద అందరూ తప్పు పడుతున్నారు. ఇటువంటి తప్పుడు చర్యలకు దిగకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.