ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ. బీసీ ఉద్యమకారుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, ఏలేటి నిరంజన్ రెడ్డి, ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డి పేర్లను ప్రకటించారు సీఎం.
అయితే జగన్ ఎంపిక చేసిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందినవాళ్లు కావడం చర్చనీయాంశమైంది. అందులో బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యది వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి గ్రామం, బీసీ ఉద్యమ నాయకుడు. ఇక ఏలేటి నిరంజన్ రెడ్డి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్. 1992లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న నేతలు, వైసీపీలోనూ బీసీ వర్గానికి చెందిన నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ.. తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేయడంపై పార్టీలోనూ చర్చ నడుస్తోంది.
ఇక తనను రాజ్యసభసభ్యుడిగా పంపుతున్నందుకు జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు కృష్ణయ్య. బీసీలపట్ల జగన్ చూపుతున్న ప్రేమ మరే ముఖ్యమంత్రీ చూపలేదని అయన వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం తాను మొదట్నుంచి పోరాడుతున్నానని, తన అంకిత భావాన్ని గుర్తించి మరింత సేవ చేసే అవకాశాన్ని జగన్ ఇచ్చారనీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్.కృష్ణయ్య తెలిపారు.