భారతీయ సమాజంలో సేవా భారతి ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తున్నది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లు, వివిధ క్షేత్రాల కార్యకర్తలతో కలిసి సేవా భారతి ఎన్నెన్నో సేవా పనులు చేపడుతున్నది. దేశవ్యాప్తంగా వరదలు వచ్చినా, ప్రకృతి ఇబ్బందులు వచ్చిన ముందుగా స్పందించేది సేవా భారతి కార్యకర్తలే. అనేకచోట్ల అనాధ శరణాలయములు బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేసి ఉధృతంగా సేవలను నిర్వహిస్తోంది. ప్రచారం కన్నా పనిచేయడం మీదే ఎక్కువ దృష్టి పెట్టడం సంఘ్ నేర్పిన గొప్ప సిద్ధాంతం. ఈ స్ఫూర్తితో ముందుకు వెళుతున్న సేవా భారతి దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా సేవలను అందిస్తోంది.
ఇటువంటి సేవా కార్యక్రమంలో అనేకమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి..
సేవా భారతి ప్రేరణతో నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఆ వ్యక్తులను మరింత ప్రోత్సహించడానికి సేవా భారతి ఢిల్లీ ఆధ్వర్యంలో వ్యక్తులు, సంస్థలకు ఓ సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.
ఈ వేదిక నుంచి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ… సేవా భారతి అట్టడుగు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. ఈ ప్రయత్నాలతో భారత్ .. నిస్సందేహంగా విశ్వ గురువుగా తన స్థానాన్ని తిరిగి పొందుతుందని అన్నారు.
ఆరెస్సెస్ వంటి సంస్థలు.. కేవలం దేశ నిర్మాణం తో పాటు వ్యక్తి నిర్మాణం కూడా చేస్తున్నాయి అన్నారు. ఇప్పుడు వచ్చిన మార్పులు, కమ్యూనికేట్ చేసే విధానాలు, ఉపయోగించే భాష.. ఇవన్నీ సంఘ్ నుంచి వచ్చిన ఫలితాలేనని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అసాధ్యమనుకున్న వాటిని ఓ వ్యవస్థీకృతంగా పనిచేస్తూ ఫలితాలు సాధించడం ఎలాగో సేవా భారతి ప్రత్యక్ష తార్కాణమన్నారు. సేవ అనే రంగం వ్యక్తిని, దేశాన్ని రెంటినీ నిర్మిస్తుందని, సేవా భారతి నిరంతరం దీనికి సహకరిస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సేవా భారతి కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్న అనేకమంది విశిష్టులకు సత్కారం చేశారు.