కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్లను ఎగుమతి చేసే విధానాన్ని ఆపాలంటూ కోరారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇలాగే కొనసాగితే దేశం ఆర్ధికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని లేఖలో తెలిపారు. వ్యాక్సినేషన్ అనేది ఓ వ్యక్తిపై ఆధారపడకుండా ముందుకు సాగిపోతుండాలని.. సాధ్యమైనంత మేరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేయాలంటూ రాహుల్ పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తయారీలో భారత్ ముందు ఉన్నప్పటికీ.. వ్యాక్సినేషన్ డ్రైవ్లో మాత్రం దేశంలో మెల్లిగా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల్లో కేవలం 1శాతం కంటే తక్కువ మందికే వ్యాక్సిన్ అందిందంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇలా జరిగితే 75 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియకు చేరుకోవాలంటే సంవత్సరాలు పడుతుందని దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతుందని.. ఈ సమయంలో వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపడం సరికాదంటూ లేఖలో పేర్కొన్నారు.