పార్లమెంటు ప్రాంగణంలో తోపులాట చోటుచేసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారు అంటూ కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఈ క్రమంలో రెండు పార్టీల ఎంపీలు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు నెట్టి వేయడంతో కొందరు బిజెపి ఎంపీలు కింద పడిపోయారు వారికి గాయాలు తగలడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తోయడం వల్లే ఎంపీలకు గాయమైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి తలకు గాయం కావడంతో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, ఆ ఎంపీ తనపై పడిపోయారని, దాంతో తాను కింద పడిపోయినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ తెలిపారు. రాహుల్ గాంధీ ఎంపీని తోసివేసిన సమయంలో తాను మెట్ల వద్ద నిలుచుకున్నట్లు చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి ఐసియులో చికిత్స అందిస్తున్నారని బిజెపి వర్గాలు తెలిపాయి.
ఈ వాదనను కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖండిస్తున్నాయి. బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని, పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ ఇదంతా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందని తెలిపారు.
కాగా ఈ తోపులాట మీద పోలీసు కేసు నమోదు అయింది. ఇందులో రాహుల్ గాంధీని నిందితుడుగా పేర్కొనడంతో మేటర్ సంచలనం సృష్టిస్తున్నది.