కాంగ్రెస్ కూటమి నుంచి మిత్రపక్షాలు జంప్..
కాంగ్రెస్ పార్టీ వైఖరితో మిత్ర పక్షాలు కూడా విసిగిపోతున్నాయి. మైనార్టీల మీద మితి మీరిన ప్రేమతో దేశ ఔన్నత్యానికి చేటు తీసుకొని వస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవుల కోసం ఎంతకైనా తెగిస్తాం అన్నట్లుగా కాంగ్రెస్ నాయకత్వం ప్రవర్తిస్తోంది. దీంతో అనేక చోట్ల కాంగ్రెస్ అంటేనే కోపం ఏర్పడుతోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సాగనంపాలి అన్న భావన కలుగుతోంది.
దీనికి ప్రత్యక్షంగా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. జార్ఖండ్ వంటి చోట్ల మిత్రపక్షం జే ఎమ్ ఎమ్ గెలిచింది, తప్పితే కాంగ్రెస్ కు పెద్దగా సీట్లు రాలేదు. కాంగ్రెస్ తో పాటు, నమ్ముకొన్న మిత్రపక్షాలు కూడా వరుసగా మునిగిపోతున్నాయి. ఈ ఓటమికి కాంగ్రెస్, రాహుల్‌గాంధీ కారణం అని మిత్రపక్షాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి భాగస్వామ్య పార్టీల్లో నమ్మకం సడలింది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్‌ను నమ్ముకుంటే తామూ మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇప్పటికే సమాజ్‌వాదీ, ఎన్సీపీ శరద్చంద్ర పవార్ వర్గం, ఆమెకు మద్దతు తెలుపుతున్నాయి.
ఈ లోగా పోటీలోకి శివసేన కూడా దిగుతోంది. మమతా బెనర్జీ కన్నా ఉద్దవ్ ఠాక్రే సూపర్ అంటూ కామెంట్స్ చేస్తోంది. ఈ విషయం మీద శివసేన అధికార ప్రతినిధి ఆనంద్ దుబే కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ సమర్థ నాయకురాలే అని.. అయితే, కూటమికి నాయకత్వం వహించేందుకు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అత్యంత సరైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ కూటమిలోనే నాయకత్వం కోసం పోటీ అంతకంతకూ పెరగుతోంది. పైగా మైనార్టీల ప్రేమ పేరుతో అనేక చోట్ల కాంగ్రెస్ పరువు పోగొట్టుకొంటోంది.
మరో వైపు ఆప్ పార్టీ కూడా కాంగ్రెస్ పేరు చెబితే దండం పెట్టేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి స్పష్టం చేశారు. ‘ఇండియా’ కూటమిలోని ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో జతకట్టనున్నాయన్న ఊహాగానాల్ని ఆయన తోసిపుచ్చారు. సొంతంగా ఎన్నికల బరిలో దిగుతున్నామని కేజ్రీవాల్ ప్రకటించారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే 31 స్థానాల్లో ఆప్ తన అభ్యర్థుల్ని ప్రకటించింది.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పడితేనే మంచిది అన్న భావన మిత్ర పక్షాలలో కలుగుతోంది. లేదంటే కాంగ్రెస్ తో పాటు తమను కూడా ప్రజలు తరిమి కొడతారు అన్న భయం ఏర్పడుతోంది.