క్వీన్ ఎలిజబెత్ లేకుండానే ఈసారి బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాణి ప్రారంభ సమావేశాలకు హాజరుకాబోరని బకింగ్ హామ్ ప్యాలెస్ ముందుగానే ప్రకటించింది. 96 ఏళ్ల క్వీన్ అనారోగ్యసమస్యలతో బాధపడుతోంది. వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్యాలెస్ తెలిపింది. ప్రతీ ఏటా పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా… రాజ్యాంగపరమైన కార్యక్రమాన్ని ఆమె నేతృత్వంలో నిర్వహిస్తారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తన సింహాసనంపై ఆసీనులై ప్రసంగిస్తారు క్వీన్ ప్రతిసారీ.
కొంతకాలంగా ఎలిజబెత్ బయటకు రావడం లేదు. నిలబడడం, నడవడం కష్టంగా ఉంటోంది. దీంతో ముఖ్యమైన కార్యక్రమాలనూ రద్దు చేశారు. మార్చి 29న తన భర్త సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావడమే చివరి సారి.
గర్భవతిగా ఉన్న 1959, 1963 సంవత్సరాల్లో తప్ప ప్రతీ పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమాలకు రాణి హాజరయ్యారు. అయితే ఇవాల్టి ప్రారంభ కార్యక్రమానికి ప్రిన్స్ చార్లెస్ హాజరయ్యారు. అయితే క్వీన్ ధరించే ఇంపీరియల్ స్టేట్ క్రౌన్ ను మాత్రం ధరించలేదు. కానీ దాన్ని కారులో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. ఇక క్వీన్ కూర్చుని ప్రసంగించే సింహాసనాన్ని పార్లమెంట్ అప్పర్ చాంబర్లో ఖాళీగా ఉంచారు. క్వీన్ ఎలిజబెత్-2 దాదాపు 70ఏళ్లుగా పాలిస్తున్నారు. బ్రిటన్ రాచరిక చరిత్రలో ఇది రికార్డ్.