
రాయలసీమ లో వందలాది గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన మహానుభావుడు సత్యసాయిబాబా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఆయన ద్వారా సేవలు అందాయని ఆయన ప్రశంసించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో ఆయన శత జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టమని అన్నారు. పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, తదితరులు అతిథులుగా హాజరు అయ్యారు. సత్యసాయి సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతించారు. “లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్” అనేది సత్యసాయి చూపిన మార్గమని, విశ్వశాంతి, సకల జనుల సంతోషం అనే ఉన్నత భావనతో ఆయన జీవించారని గుర్తుచేశారు. “మానవ సేవే మాధవ సేవ” అని కేవలం బోధించడమే కాకుండా, దాన్ని ఆచరించి ఫలితాలు చూపించిన మహనీయుడు బాబా అని పేర్కొన్నారు. ప్రేమ ఒక్కటే మతమని, హృదయం ఒక్కటే భాష అని, మానవత్వమే కులమని చాటిచెప్పారని, ఆయన బోధనలతో నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలను తన మనో దర్శనంతో ప్రభావితం చేశారని అన్నారు.
పుట్టపర్తిలో సేవలను చంద్రబాబు గుర్తు చేశారు. భక్తులను ఆయన ఎంతో ప్రేమగా ‘బంగారూ’ అని పిలిచే పిలుపు ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమాలపై బాబా పలుమార్లు తనతో చర్చించారని నాటి స్మృతులను నెమరువేసుకున్నారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందించిన ఘనత సత్యసాయిదని అన్నారు. నేడు 102 సత్యసాయి విద్యాలయాల ద్వారా సుమారు 60,000 మంది విద్యార్థులు ఉత్తమ విద్యను పొందుతున్నారని వివరించారు.
సెలబ్రిటీలు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్, మొదలైన వారి రాకతో సందడిగా మారింది. వేల సంఖ్యలో భక్తుల రాకతో పుట్టపర్తి జన సంద్రంగా మారిపోయింది.



