అనేక సంవత్సరాలు సస్పెన్స్ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలోని రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. కోర్టుల ఆదేశం మేరకు నిర్ణయిక కమిటీ సమక్షంలో ఈ భాండాగారం తలుపులు తెరిచారు. ఇందులోని సంపాదన లెక్కించే పనిని చేపట్టారు.
కొంతకాలంగా రత్న భాండాగారం లోని సంపద కు సంబంధించి చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
46 ఏళ్ల కిందట 1978 లో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్లీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు. మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ తలుపులు తెరిచే ప్రక్రియ చేపట్టారు. తలుపులు తెరిచే సందర్భంగా ఆలయంలో జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు.
తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతోపాటు ఏఎస్ఐ సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్లతోపాటు నలుగురు ఆలయ సహాయకులు కూడా వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భాండాగారం తలుపులు తెరిచే ముందు ‘ఆజ్ఞ’ పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత లోపలి నిధిని వేరేచోటుకు తరలించనున్నారు. మరమ్మతులు పూర్తయ్యేదాకా సంపదను వేరేచోట భద్రపర్చనున్నారు.
మరోవైపు ఆలయంలో కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నాయి.
ఈ పూరీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు. దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. 1978లో చివరిసారి ఈ భాండాగారాన్ని తెరిచిన సమయంలో లోపల ఉన్న సంపదను లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. బంగారం, వెండితోపాటు వజ్రాలనూ గుర్తించారు. వీటన్నింటిని లెక్కించి ఓ జాబితా రూపొందించారు.
ఇక ఆ రత్న భాండాగారం మీద చాలా రహస్యాలు నెలకొని ఉన్నాయి. లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద ఎటువంటి అలజడి లేకుండా రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి నిపుణుల సమక్షంలో నిధులు సంపద లెక్కింపు పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు