మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్ట సభ లో సాక్షిగా బయట పెట్టిన వాస్తవాలు. ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చేందుకు మాత్రమే డబ్బులు ఉన్నాయి తప్పితే, భత్యాలు ఇతర అవసరాలు తీర్చే పరిస్థితి లేనే లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం, అప్పులకు వడ్డీలు కట్టడం మాత్రమే చేయగలం తప్ప మరో పని ఏమీ చేయలేమని తేల్చి చెప్పేశారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన భారీ హామీల సంగతి ఏమిటి అంటే.. అవి ఉత్తుత్తి హామీలు అన్న సంగతిని అర్థం చేసుకోవాల్సిందే. మొన్నటికి మొన్న ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పేశారు. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఎలక్షన్స్ లోనూ ఇస్తున్న ఉచిత హామీలను అర్థం చేసుకోవచ్చు. అంటే ఉచితాలు, గ్యారంటీ కార్డులు అంటూ హామీలు ఇస్తారు తప్పితే ఏమాత్రం అమలు చేయరు అన్నది తెలిసిపోతోంది. కర్నాటకలోనూ, తెలంగాణ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నది ఇది మాత్రమే. అంత మాత్రాన ఎవరూ ఎన్నికల హామీల గురించి అడగవద్దు అని, నిరసనలు చేయవద్దు అని కూడా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. కావాలంటే ప్రతీ ఒక్కరూ మరో రెండు గంటలు అదనంగా పనిచేసి నిరసన తెలుపుకోవాలి అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఎన్నికల హామీల మీద ఎవరూ ప్రశ్నించవద్దని, ఈ మాదిరిగా నిరసనలు ఏళ్ల తరబడి చేసుకోవచ్చు అని స్పష్టం చేస్తున్నారు.
దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు, వైఖరి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం ఇది.