ఉత్తరప్రదేశ్ లో మథుర శ్రీకృష్ణాలయానికి ఆనుకుని ఉన్నమసీదు వాస్తవానికి ఆలయ భాగమేనని అక్కడ నమాజు చేయకుండా ఆపాలని స్థానిక కోర్టులో కొందరు పిటిషన్ వేశారు. మసీదు నిర్మాణానికి ముందు ఆస్థలంలో దేవాలయం ఉందంటూ పిటిషనర్లు కోర్టుకెళ్లారు. జ్ఞానవాపి మసీదులో సర్వే, శివలింగ్ బయటపడిన నేపేథ్యంలో మథుర ఆలయంకోసం కేసు వేయడం చర్చనీయాంశమైంది. హిందూ ఆలయంపైనే ఇప్పుడున్న మసీదు కట్టారంటూ పిటిషనర్ల తరపున న్యాయవాది శైలేంద్రసింగ్ అంటున్నారు. హిందువులకు భగవంతుడైన శ్రీకృష్ణుడు పుట్టిన ప్రాంతంలో ఆయన ఆలయంలో ముస్లింలు ప్రార్థనలు చేయడం సరికాదని..అక్కడ ఇక నమాజు చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని పిటిషన్లో కోరినట్టు ఆయన తెలిపారు. వారణాశి ఆలయాన్ని కూల్చివేసిన మొఘల్ రాజు ఔరంగజేబే మథుర ఆలయాన్నీ ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయని స్థానికులు, పలు హిందూసంస్థలు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయోధ్యలో రామజన్మభూమి కేసు గెలిచిన తరువాత ఇక మథురను సొంతంచేసుకోవడమేనని సందర్భం వచ్చిన ప్రతిసారీ హిందూసంస్థలు ప్రకటిస్తున్నాయి. ఉద్యమం చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందన్న వార్తల నేపథ్యంలో మథుర అంశం మళ్లీ తెరమీదకి వచ్చింది.
మథుర మసీదులో నమాజు ఆపాలంటూ న్యాయవాదులు మహేంద్ర ప్రతాప్ సింగ్, రాజేంద్ర మహేశ్వరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూలై ఒకటిన విచారణ జరుపుతామని సీనియర్ డివిజన్ కోర్టు సివిల్ జడ్జి తెలిపారు.
ఈ మసీదును తొలగించాలని కోరుతూ గతంలో 10 పిటిషన్లు మథుర కోర్టులో దాఖలయ్యాయి.ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన వాగ్దానాల్లో మథురను తిరిగి తీసుకురావడం కూడా ఓ హామీ.