కర్ణాటకలో పుత్తూరులో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం సీఎం బసవరాజ్ బొమ్మై ఎన్ఐఏ కి అప్పగించాలని నిర్ణయించారు. హత్య కేసులో వ్యవస్థీకృత నేరాలు మరియు అంతర్ రాష్ట్ర సంబంధాలు ఉన్నందున, దర్యాప్తును NIAకి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బొమ్మై విలేకరులతో అన్నారు.
హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కారణమైన సంస్థలనూ వదిలేది లేదని ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అంతే కాదు అవసరమైతే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అవలంభిస్తున్న విధానం తాము కూడా అమలు చేస్తామన్నారు.