ప్రముఖ వైద్యావేత్త, ఆర్యసమాజ్ కార్యక్రమాలలో క్రియాశీలంగా పాల్గొన్న, సామాజిక సేవలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. టీవీ నారాయణ మంగళవారం కన్నుమూశారు. అనారోగ్యంతో వారం రోజుల క్రితం బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. అణగారిన వర్గాలకు పెద్ద దిక్కుగా చిరకాలం కొనసాగారు. వారి హక్కుల కోసం, వారి సామాజిక ఉద్దరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.
ఆయన వయసు 96. ఆయన కుమారుడు, కుమార్తె ఉన్నారు. నారాయణరావు స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, ప్రజాసేవకుడు, కవి, రచయిత, అణగారిన వర్గాల కోసం దార్శనికుడు.ఆయన తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు. స్వతంత్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపారు.
సామాజిక సేవకు గానూ 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆయన సతీమణి టీఎన్ సదా లక్ష్మి మాజీ మంత్రి. ఆమె పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఉపాధ్యాయుడిగా రూ 30 జీతంతో జీవనం ప్రారంభించి, అంచెలు అంచెలుగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. నారాయణరావు ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్‌గా, విద్యాశాఖగా, సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా, నేషనల్ సెన్సార్ బోర్డ్ సభ్యునిగా కూడా పనిచేశారు. తొలి ఎస్సి కమీషన్ సభ్యునిగా పనిచేశారు. నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ సభ్యునిగా పనిచేశారు. 30కు పైగా గ్రంధాలు వ్రాసారు. అర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం కవిత సంపుటి వంటి గ్రంధాలు వ్రాసారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా వేద పండిట్ పురస్కారం, తెలుగు యూనివర్సిటీ నుంచి ధర్మరత్న పురస్కారం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి దళితరత్న అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
ఆయన జూలై 26, 1925న జన్మించారు. నిజం కళాశాలలో బిఎ చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బి, ఎల్ ఎల్ ఎం; బెనారస్ హిందూ యూనివర్సిటీ లో ఎం ఎ ఇంగ్లీష్ పూర్తి చేశారు. 71 ఏండ్ల వయస్సులో కర్ణాటక యూనివర్సిటీ నుండి పి హెచ్ డి పూర్తిచేశారు.
నారాయణరావు భార్య సదా లక్ష్మి 2004లో మరణించారు. ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్య వి భాగయ్య, ఇతర ప్రముఖులు నారాయణరావుకు నివాళులర్పించారు. ఆర్యసమాజ్ నాయకుడిగా నారాయణరావు సేవలను భాగయ్య గుర్తు చేసుకున్నారు.
నారాయణరావు అంత్యక్రియలను బుధవారం బన్సీలాల్‌పేటలో నిర్వహించనున్నారు. ఆయన మృతి పట్ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. నారాయణ ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారని కిషన్ గుర్తు చేసుకున్నారు. నారాయణరావుకు మచ్చలేని కీర్తి ఉందని, ఆయన మరణం తెలుగువారికి తీరని లోటని కిషన్ తెలిపారు.
నేటి ఆధునిక కాలంలో ఒక ఋషి
టి.వి.నారాయణ రావు నేటి ఆధునిక కాలంలో ఒక ఋషి అని సామాజిక సమరత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ నివాళులు అర్పించారు . ఒక ప్రక్క సమకాలీన ఎస్సీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ, సామాజిక సమతకై ఉద్యమిస్తు, ఒక ఆదర్శ హిందువుగా, ఒక ప్రగాఢ దేశభక్తునిగా అన్ని సమయాల్లో వారు వ్యవహరించారని కొనియాడారు.
విద్యా రంగంలో, సామాజిక రంగంలో, ధార్మిక రంగంలో అనేక విలువైన సేవలను అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ లో ఆర్యసమాజం వారిని, వారి ద్వారా తెలంగాణ ప్రజలను ఉత్తమ ఆర్యులుగా తీర్చి దిద్దారని తెలిపారు. వారు రాష్ట్ర ఎస్సీ.,ఎస్టీ కమిటీ సభ్యునిగా, రాష్ట్ర ఆర్యసమాజం కార్యదర్శి గా పని చేశారని అంటూ ఆయన మనః పూర్వక శ్రద్ధాంజలి సమర్పించారు.
డా. నారాయణ మృతి పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విప్లవ కవి గద్దర్, కృష్ణ మాదిగ, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి వంటి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Courtesy : నిజంటుడే