ప్రధాని వాహనం మీదా ఏడ్పులేనా…ఏంటీ పుకార్లు, ఎందుకీ విషప్రచారం?
మోదీ కాన్వాయ్ లో Mercedes-Maybach S650 గార్డ్ చేరింది. అయితే దానిపై మీడియాలోనూ, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. దాని ఖరీదు 12 కోట్లని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అయితే మోదీ ఖరీదైన సన్యాసిగా మారాడని 20 కోట్ల కారులో తిరుగుతున్నారనీ వ్యాఖ్యానించారు. ఇంకా మేధావులమని చెప్పుకుతిరిగే వామపక్షవాదులు, ఉదారవాదుల నోటికైతే హద్దూ అదుపూ లేకుండా పోయింది. ఓ వర్గం జర్నలిస్టులు సైతం ఎప్పటిలాగే విషం చిమ్మడం మొదలు పెట్టారు. ప్రసారభారతి మాజీ సీఈవో, టీఎంసీ రాజ్యసభ సభ్యుడు అయిన జవహర్ సిర్కార్ ట్విట్టర్ వేదిగ్గా మోదీని లక్ష్యంగా విరుచుకుపడ్డారు. మోదీ ఆడంబరాలకు హద్దేలేకుండా పోతోందని, ఓడిపోయినా కూడా ఆయన తన విలాసాలను, సకలసదుపాయాలను వదిలేలా లేరనీ అన్నారు.
మరో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం మోదీని లక్ష్యంగా ప్రచారం మొదలుపెట్టారు. తన కాన్వాయ్ లో మెర్సిడెస్ కారును చేర్చడంపై సెటైర్లు వేశారు. మోదీకి విలాసాలు తప్ప మరేం పట్టవన్నారు. ప్రధాని పదవి భద్రత కోసం కాక మోదీ వ్యక్తిగత అవసరాల కోసమే దాన్ని చేర్చినట్టుందంటూ ట్వీట్ చేశారు.
వీళ్లు మాత్రమే కాదు మోదీ ప్రత్యర్థులంతా ఈ సందర్భంగా ఏకమైపోయారు. కారుప్రత్యేకతలు, ధర, భద్రతాంశాలపైనా విస్తృత చర్చే చేశారు. సత్యదూరమైన పుకార్లూ రేగాయి. వాస్తవాల కన్నా ఊహాగానాలు, తప్పుడు సమాచారాన్ని నెట్టింట్లోకి వదిలారు మేధావులు.
మీడియా,సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు కారు ధర 12 కోట్లు కాదని..కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టు 20 కోట్లు అసలే కాదని… దాని ధర వారు ఊహించి ప్రచారం చేస్తున్న దానిలో 1/3 వంతు కన్నా తక్కువేనని సంబంధింత అధికార వర్గాలు స్పష్టం చేయాల్సి వచ్చింది.
ప్రధాని కాన్వాయ్ లోని కార్లను మార్చడం సాధారణమని …అంతకు ముందటి బీఎండబ్ల్యూ కార్ల తయారీని జర్మనీ నిలిపేయడంతో ఇప్పుడు మెర్సిడస్ ను తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు. అత్యంత పటిష్టమైన భద్రతా ప్రమాణాలున్నప్రధాని కాన్వాయ్ కార్లను ఎంపిక చేసేది ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ …ఎస్పీజీ. దేశానికి కీలకమైన, అత్యున్నత వ్యక్తి అయిన ప్రధాని కనుక అందుకు తగిన విధమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ కార్ల డిజైనింగ్ ఉంటుంది. వాటిని ఎంపిక చేసే బాధ్యత, పూర్తి స్వేచ్ఛ ఎస్పీజీకే ఉంటుంది. ప్రధాని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు మెర్సిడస్ కారు కొనుగోలు నిర్ణయం మోదీది కాదు, ఆయనకు సంబంధమే లేదు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ గతంలో రేంజ్ రోవర్ కార్లు వినియోగించారు. అసలైతే అవి ప్రధాని కోసం కొనుగోలు చేసినవి. అంటే నాయకుల భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీనే వారి వాహనాలను నిర్ణయిస్తుంది తప్ప నాయకుల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు.
అసలు దేశ ప్రధానికి సంబంధించిన వాహనంపై ఇంత చర్చనే అనవసరం. అది ప్రమాదకరం కూడా. దేశప్రయోజనాల దృష్ట్యా, ప్రధాని భద్రత దృష్ట్యా ఆయన వ్యక్తిగత వాహన వివరాలు బహిర్గతం చేయకూడదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మేధావులు, నాయకులు మరోసారి భారత ప్రధానిపై కావాలని విమర్శలు గుప్పించడం సిగ్గుచేటు.
ఇక మోదీ కోసం ఎంపిక చేసిన ఈ కొత్త కారు అత్యాధునిక పరిజ్ఞానంతో..650 హార్స్ పవర్ సామర్థ్యం కలది. ప్రపంచంలోనే అత్యధిక సేఫ్టీ రేటింగ్ అయిన వీఆర్-10 ఇది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ తో తయారు చేసిన ఈ కారు ఎంతటి శక్తిమంతమైన పేలుళ్లను అయినా, ఎంత ఫోర్సుగా వచ్చే బుల్లెట్లను అయినా తట్టుకుని లోపల ఉన్నవారిని కాపాడుతుంది. కారు లోపల మంటలు వ్యాపించినాప్రమాదం జరగకుండా ట్యాంక్ వాల్వులు ఆటోమెటిగ్గా మూసుకుంటాయి. కారుకు 360 డిగ్రీల కెమెరాలను అమర్చారు.