జులై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది. సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న నేపథ్యంలో… టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నెలకొంది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు.దీంతో కాషాయ, గులాబీ రంగులతో కూడిన జెండాలు, బ్యానర్లతో సిటీ సెంటర్ నిండిపోయింది.
నగరంలో నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కూడిన భారీ కటౌట్లను బీజేపీ ఏర్పాటు చేసింది. అదే విధంగా నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా చిత్రపటాలతో టిఆర్ఎస్ ఏర్పాటు చేసిన కటౌట్లు, బ్యానర్లు దర్శనమిచ్చాయి.
“యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ పోస్టర్లు వెలిశాయి. భారత రాష్ట్రపతి ఎన్నికలో శ్రీ యశ్వంత్ సిన్హా జీకి మేం మద్దతు ఇస్తున్నాం”అని అందులో ఉంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం’’ అని బీజేపీ పోస్టర్లు రాసి ఉన్నాయి. జులై 2, 3 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జులై 1 నుంచి 4 వరకు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా నిషేధిస్తూ 144 సెక్షన్ విధిస్తూ ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. “ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఒక పండుగ వాతావరణంలో నిర్వహించనుంది. ప్రజలు ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు అనేక అవరోధాలు సృష్టిస్తోంది. బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.కానీ మేం ప్రజల సహకారంతో ఈ సమావేశాలను విజయవంతం చేస్తాం. దేశాన్ని, రాష్ట్రాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతాం” అని అన్నారు.
“బీజేపీ జరుపుకొనే పండగకు కేసీఆర్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో చెల్లని కేసీఆర్ మొహం పక్క రాష్ట్రాల్లో చెల్లుతుందా?” అని ఈటల ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతారా? అని నిలదీశారు. కేసీఆర్ దోపిడీ వల్లే రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని ఈటల విమర్శించారు.