పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ మార్టం జరుగుతోంది . అధిష్టానం పంపించిన కురియన్ కమిటీ తెలంగాణలో పర్యటిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సగం సీట్లు మాత్రమే గెలుచుకోవడానికి కారణాలు ఆరా తీస్తున్నారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ (కురియన్ కమిటీ) మూడు రోజులు పర్యటించింది. వివిధ ప్రాంతాలలో కురియన్ కమిటీ కాంగ్రెస్ ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలను సేకరించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావంలేని బీజేపీతో సమానంగా 8 సీట్లు గెలుపొందడాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. రాష్ట్రంలో కనీసం 12 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయినా 8 సీట్లకు పరిమితం కావడంతో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకొనేందుకు ఈ కమిటీ నియమించారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మినహా మిగిలిన 16 మంది హాజరయ్యారు. కాంగ్రెస్ ఓటమికి కారణాలు తెలుసుకొనే దానికి బదులు బిజెపి ఎందుకు అన్ని సీట్లు గెలిచిందని దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడంపై కురియన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
గెలిచేందుకు అవకాశం ఉన్న ఆదిలాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో ఓడటంపై ప్రశ్నలు సంధించినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహించిన, సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలో ఓడిపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఇలా ఉండగా, కురియన్ కమిటీ ముందు హాజరైన ఓటమి పాలైన అభ్యర్థులు అందరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పడం పట్ల కురియన్ కమిటీ సభ్యులు ఒక్కింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దానితో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న కురియన్ కమిటీ తమను కలవడానికి ముందు వారంతా ఒకేరకంగా చెప్పాలని ఏమైనా మాట్లాడుకున్నారా? అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘సీఎం రేవంత్రెడ్డి మా విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, దిశా నిర్దేశం చేశారు. ఇన్చార్జి మంత్రులు ప్రచారం ముగిసేవరకు చిత్తశుద్ధితో పని చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల బీజేపీ వేవ్, బీఆర్ఎస్ అభ్యర్థులు వారితో చేతులు కలుపడం వల్లనే విజయం సాధించలేకపోయాం’ అని కురియన్ కమిటీ ఎదుట హాజరైన అంతా ఒకే రకంగా చెప్పినట్టు తెలిసింది.
మూడు రోజుల పర్యటన అనంతరం కురియన్ కమిటీ అధిష్టానానికి నివేదిక ఇవ్వబోతోంది. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కొన్ని మార్పులు ఉంటాయి అని చెబుతున్నారు.