గోవాలో పోర్చుగీస్ వాళ్లు ధ్వంసం చేసిన ఆలయాలను పునర్మించాల్సి ఉందని
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. పర్యాటకులను దేవాలయాల వైపు ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన “ఆర్గనైజర్-పాంచజన్య మీడియా కాన్క్లేవ్” వేదిగ్గా ఆయనీవ్యాఖ్యలు చేశారు.
“పోర్చుగీసు వారు గోవాలోని ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేశారు. గోవాకు వచ్చే టూరిస్టులు ఇప్పటి వరకు బీచ్‌లకు మాత్రమే ఆకర్షితులయ్యారు, కానీ ఇప్పుడు వారిని దేవాలయాలకు తీసుకురావడం మా కర్తవ్యం, ”అని సావంత్ అన్నారు. ఆలయాల పునర్నిర్మాణానికి బడ్జెట్లో ఇప్పటికే నిధులు కేటాయించామని ఆయన తెలిపారు.
అన్ని రాష్ట్రాల్లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చేసిన వ్యాఖ్యను సమర్థించిన గోవా సీఎం, గోవా రాష్ట్ర విముక్తి పొందినప్పటి నుంచి ఆ విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. “గోవా విముక్తి తర్వాత యూనిఫాం సివిల్ కోడ్‌ని అనుసరిస్తోందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయాలి..60 ఏళ్లుగా గోవా సాధించలేనిది, 2012 నుంచి 2022 మధ్య మేం సాధించాం.. అతి త్వరలో ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా గోవా ఉంటుంది” అని సావంత్ అన్నారు.
అదే కార్యక్రమంలో పాల్గొన్న ధామి….అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను హామీఇచ్చినట్టు యూనిఫాం సివిల్ కోడ్‌ను రాష్ట్రంలో తీసుకువస్తానని అన్నారు. అందుకు డ్రాఫ్ట్ ను సిద్ధం చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నామని.. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ధామి.