బీజేపీ, జేడీ(యూ) పక్షాల మధ్య విభజన చర్చ నేపథ్యంలో బీహార్ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చీలిక వస్తుందనే ఊహాగానాల మధ్య సీఎం నితీష్ కుమార్ రేపు అఖిలపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సహా జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ హాజరు కాలేదు. దీంతో ఎన్డీఏ నుంచి ఆయన విడిపోనున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది. దీంతో ఆగస్ట్ 11వతేదీ లోపు బీహార్ లో ఎన్డీఏ పాలన కూలిపోతుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
జేడీ(యూ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాజీ మిత్రపక్షమైన ఆర్జేడీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాలు ఏర్పడ్డాయి. బీహార్లో జేడీ(యూ)-బీజేపీ పొత్తు తెగిపోతోందని రాజకీయ పరిశీలకుల అంటున్నారు. చాలా మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున.. బీహార్లో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆ పార్టీ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ లతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని రాజకీయ వర్గాలు తెలిపాయి.
జులై 17న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశానికి నితీశ్ హాజరుకాలేదు. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా రామ్నాథ్ కోవింద్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి కూడా వెళ్లలేదు. ఆ తర్వాత జులై 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకరానికి కూడా నితీశ్ హాజరు కాలేదు. తాజాగా నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేదు.