ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి .. జై తెలంగాణ అంటూ జేజేలు పలికారు. మన్ కీ బాత్ లో ఈసారి దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చే వీరుల గురించి మాట్లాడారు. తెలంగాణ సమాజానికి గౌరవప్రదమైన పేరు తీసుకొని వచ్చి కొమురం భీమ్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా, గిరిజనుల స్వాతంత్రం కోసం భీమ్ చేసిన పోరాటం దేశ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టమని ప్రధాని అన్నారు.
“జల్, జంగల్, జమీన్” అంటే నీరు, అడవి, భూమి అనే నినాదం నేటికీ గిరిజన ఉద్యమాలకి ప్రేరణగా నిలుస్తుందని మోదీ గుర్తు చేశారు. ఆ కాలంలో నిజాం అణచివేతకు భయపడకుండా ప్రజల హక్కుల కోసం ఆయుధం ఎత్తిన భీమ్ త్యాగం గిరిజన గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు.
……………………………………….
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా జోద్ఘాట్ గ్రామంలో కొమురం భీమ్ జన్మించారు. ఆయన గోండ్ తెగకు చెందినవారు. చిన్ననాటి నుంచే నిజాం పాలనలో విపరీతంగా జరిగిన అణచివేత, దోపిడీ అన్యాయాలను ఆయన చూశారు. నిజాం పాలనలో గిరిజనుల భూములు లాక్కోవడం, వారికి అన్యాయం జరగడం చూసి భీమ్ తిరుగుబాటు మార్గం ఎంచుకున్నారు. గిరిజనులకు స్వాభిమానాన్ని నూరిపోసి, వారికి స్ఫూర్తినిచ్చే నాయకుడిగా ఎదిగారు. భీమ్ పోరాటం సాయుధ ఉద్యమం రూపంలో సాగింది. ఆయన అనుచరులతో కలిసి అరణ్యప్రాంతాల్లో గెరిల్లా విధానంలో నిజాం సైన్యానికి ప్రతిఘటించారు. అడవులలో చిన్నచిన్న గిరిజన గ్రామాలను కేంద్రాలుగా చేసుకుని ప్రతిరోజూ పోరాటం సాగించారు. 1940లో జోద్ఘాట్ ఘర్షణలో భీమ్ వీరమరణం పొందినా, ఆయన నినాదం మరియు ధైర్యం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
……………………………………………………………..
దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వారా.. కొమరం భీమ్ గొప్పతనం తెలియవచ్చింది. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్రను పోలిన పాత్రను హీరో గా మరల్చారు. ఈ పాత్రను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పోషించడం, హీరో ఎలివేషన్ బాగా ఉండటంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సమయంలో కొమురం భీమ్ పాత్ర చర్చనీయాంశం అయింది. ఈ సారి మోదీ ప్రసంగం ద్వారా మరోసారి యువతకు కొమురం భీమ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.



