నవంబర్ 22న కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ హత్యకేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేరర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో అతనికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. మిగిలిన నిందితుల్ని పట్టుకోవాల్సి ఉన్నందున అతని అరెస్టును గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.
అంతకుముందు..తన కళ్లెదుటే భర్తను చంపిన హంతకులను తాను గుర్తుపడతానని సంజిత్ భార్య చెప్పింది. దీంతో సోమవారం మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సంజిత్ హత్యకేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణకు ఆదేశించాలని కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది ఆర్ఎస్ఎస్-బీజేపీ కార్యకర్తలను ఇస్లామిస్టులు హత్య చేశారని…ఈ ఐదేళ్లలోనే పదిమందిని పొట్టనబెట్టుకున్నారని హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో సురేంద్రన్ ఆరోపించారు.
నవంబర్ 15న కేరళలోని ఎలప్పుల్లికి చెందిన సంజిత్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ గూండాలు నరికి చంపారు. భార్యతో మోటార్ బైక్ పై వెళ్తుండగా… పాలక్కాడ్ జిల్లా ఎల్లపుల్లి సమీపంలో దారుణంగా హత్య చేశారు. కార్లో వచ్చిన దుండగులు బైక్ ఆపి అతనిపై దాడి చేసి పారిపోయారు. సంజిత్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. అతని హత్యకు వాడిన రక్తపు మరకలున్న కత్తులను పోలీసులు ఆరోజే స్వాధీనంలోకి తీసుకున్నారు.