కేరళలోని అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు రోజుల క్రితం కొచ్చిలోని పల్లురుత్తిలో ఆ బాలుడిని పోలీసులు గుర్తించారు. అయితే కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తమ ఇంటికి తిరిగి రాగా,బాలుడి తండ్రి పోలీసులకు చిక్కాడు. తాము సెలవుల కోసం వెళ్లామని.. పోలీసుల నుంచి దాక్కోలేదని కుటుంబీకులు నమ్మబలికారు. బాలుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పీఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బాలుడి గురించి, అతని ప్రవర్తనపై పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి నివేదిక సమర్పించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత అతని కౌన్సెలింగ్కు CWC ఏర్పాట్లు చేస్తుంది.
అలప్పుజాలో PFI నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు 20 మంది PFI కార్యకర్తలను సెక్షన్లు 153 A, 295 A, 506.. అలాగే జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్లు 75, 82(2) కింద అరెస్టు చేశారు.
మతపరమైన నినాదాలు చేసిన ర్యాలీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కేరళ హైకోర్టు పోలీసులను కోరింది. అలప్పుజాలోని ఎస్డి కళాశాల మాజీ ప్రొఫెసర్గా ఉన్న ఆర్ రామరాజ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పివి కున్హికృష్ణన్ స్పందిస్తూ, ర్యాలీలో ఏ సభ్యుడు రెచ్చగొట్టే నినాదాలు చేసినా.. ర్యాలీ నిర్వాహకులు కూడా బాధ్యులని అన్నారు. దీనికి బాధ్యులైన వ్యక్తులందరిపై పోలీసు అధికారులు చట్టం ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు.