దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
ఓ వైపు పార్లమెంట్లో ఆందోళన జరుగుతుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేస్తోంది. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ అంశంపై సమాధానం రావల్సి ఉందని..సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పడంతో..కేసును ఆగస్టు 16కు కేసు వాయిదా వేసింది ధర్మాసనం.
జర్నలిస్టులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, రక్షణ రంగ ప్రముఖులు, మానవ హక్కుల నేతలు తదితరుల ఫోన్లను హ్యాకింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. కోర్టులో కేసు వాదన జరుగుతుండగానే..పిటీషనర్లు సోషల్ మీడియాలో సమాంతర చర్చలు ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఒకసారి కోర్టుల్ని ఆశ్రయించిన తరువాత విశ్వాసముంచాలని సూచించింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెగసస్ వ్యవహారంపై ఎన్ఎస్ఓ గ్రూప్(NSO Group)తో లావాదేవీలు జరపలేదని కేంద్ర రక్షణ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది.
—–
వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి కొత్త పార్లమెంట్ భవనం
వచ్చే ఏడాది ఆగస్ట్ 15 నాటికి నూతన పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు పూర్తయ్యే సందర్భంగా నూతన పార్లమెంట్ భవనం సిద్ధం అవుతుందన్నమాట. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఓం బిర్లా విలేకరులతో మాట్లాడారు. సభలో పరిణామాలు తనను బాధించాయని స్పీకర్ ఓంబిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత వరకు సభా కార్యక్రమాలు జరిగే విధంగా చూసినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగిందని విపక్షాలే సభను పదేపదే అడ్డుకున్నాయని అన్నారు. గత రెండేళ్ల నుంచి సభలో గరిష్ట స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈసారి 20 బిల్లులు పాసైనట్లు స్పీకర్ బిర్లా చెప్పారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించినట్లు ఆయన వెల్లడించారు.
వర్షాకాల పార్లమెంట్లో భాగంగా జూలై 19న ప్రారంభమైన లోక్సభ.. రెండు రోజుల ముందే నిరవధిక వాయిదా పడింది. ఈసారి 74 గంటల 46 నిమిషాల పాటు లోక్సభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఓబీసీ బిల్లు సహా 20 బిల్లుల్ని సభ ఆమోదించింది.