దక్షిణ భారత దేశంలో హీరో విజయ్ అందరికీ పరిచితులు. తెలుగులో హిట్ కొట్టిన సినిమాలను.. తమిళంలో రీమేక్ చేయడం ద్వారా గెలుపుని సాకారం చేసుకున్నారు. సూపర్ హీరోగా ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు. ఇప్పుడు తమిళంలో రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. సూపర్ స్పీడ్ తో దూసుకుని వెళ్తున్న విజయ్ కు.. మొన్న కన్నూరు సభ తొక్కిసలాట,, కళంకం తెచ్చిపెట్టింది. ఈ విషయంలో విజయ్ ని టార్గెట్ చేస్తూ డీఎంకే డోస్ పెంచింది.
………..
ఈ క్రమంలో మోదీ మార్కు రాజకీయం బయటకు వచ్చింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నేరుగా తన పాత ఫ్రెండ్ విజయ్ కి ఫోన్ చేశారు.
రాజకీయాల్లో ఎదిగేందుకు ఎన్డీయేలో చేరమని నరేంద్ర మోదీ తరపున ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. కలిసి నడవాలని, ఒంటరిగా పోటీచేస్తే గెలవడం కష్టమని, రాజకీయంగా మనుగడ సాగించలేమని పవన్ కళ్యాణ్ హిత బోధ చేశారు. ఈ విషయంలో
తన అన్న చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని ఉదాహరణగా చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తమిళనాడులో అంతటి పాపులారిటీ ఉన్న కమలహాసన్ కూడా ఒంటరి పోరాటం ద్వారా చతికిల పడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసినట్లు సమాచారం. ఇప్పుడు కమల్ కూడా డీఎంకే పంచన చేరి రాజ్యసభ సీటు సంపాదించుకున్నారు.
……….
అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీచేస్తే బలపడేందుకు అవకాశం ఉందని సూచించినట్లు తెలుస్తోంది.
కూటమి అధికారంలోకి వస్తే ఉపముఖ్యమంత్రి పదవి, ఓడిపోతే ప్రతిపక్ష నేతగా నైనా ఉండొచ్చని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని… రాజకీయ మనుగడ కోసం సరైన నిర్ణయం తీసుకోవాలనీ ఉప-ముఖ్యమంత్రి సూచించారని, దీనిపై విజయ్ కూడా పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతుంది.
…..
మరోవైపు, విజయ్ను అన్నాడీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సైతం ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్ కు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని పళనిసామి చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ఎన్డీయే కూటమిలో చేరాలని కూడా విజయ్ను ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి విజయ్ స్పందిస్తూ పొంగల్ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని చెప్పినట్టు సమాచారం.
……….
మరోవైపు, తొక్కిసలాట జరగగానే బిజెపి నాయకత్వం సైతం రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వ వైఫల్యంగా విమర్శలు గుప్పించింది . ఇటు, విజయ్ కు నైతిక మద్దతు అందించింది. పైగా తొక్కిసలాటపై నిజనిర్ధారణకోసం ఆరుగురు ఎంపీల బృందాన్ని కూడా పంపింది.
తొక్కిసలాట తర్వాత విజయ్ ను లక్ష్యంగా చేసుకొని డీఎంకే ప్రభుత్వం వేధించటాన్ని బిజెపి తప్పుబట్టింది. ఈ విషయంలో డీఎంకేను ఎదుర్కోవడంలో తాను ఒంటరివాడు కాదని, తాము అండగా ఉంటామనే భరోసాను విజయ్ కు బీజేపీ అందించింది.
…..
మొత్తం మీద విజయ్ మనసు మార్చుకుని ఎన్డీఏ కూటమిలోకి వచ్చినట్లయితే తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగినట్లే. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడడం ఖాయం. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.