మజ్లిస్ పార్టీ అగ్రనాయకులు ఒవైసీ బ్రదర్స్ మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకు పడ్డారు. సెక్యులర్ ముసుగులో ఒవైసీల ఆగడాలను కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారంటూ పరోక్షంగా చురకలు అంటించారు. సనాతన ధర్మం విషయంలో తన నిబద్ధతను పవన్ కళ్యాణ్ మరోసారి చాటుకున్నారు. పిఠాపురంలో భారీగా తరలి వచ్చిన అభిమానుల మధ్య జన సేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కన్నుల పండుగ గా జరిగింది.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పనిలో పనిగా సనాతన ధర్మం గొప్పతనాన్ని మరోసారి విడమరిచి చెప్పారు. సనాతన ధర్మం మీద విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కి అనేక భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు.
సెక్యులర్ ముసుగులో హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 15 నిముషాలు పోలీసులు మౌనం పాటిస్తే, హిందువులు లేకుండా చేస్తామని ఒవైసీ బ్రదర్స్ అంటున్నారని.. ఇటువంటి వ్యాఖ్యలు సహించేది లేదని స్పష్టం చేశారు. మన ధర్మం, మన సంఘం గొప్పవని, వీటి మీద బురద చల్లితే ఊరుకొనేది లేదని పవన్ తేల్చి చెప్పారు.