జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కీలకంగా నిలుస్తోంది. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి బలమైన మిత్రుడు పవన్ కళ్యాణ్ అని ఆయనే స్వయంగా చెప్పారు. అందుచేత బిజెపితో కలిసి నడుస్తున్నందున.. కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం తోటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రుల స్థాయి భేటీకి ఆయన దూరంగా నిలిచారు అని చెబుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నా పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం గమనార్హం.సమావేశానికి ముందు విడుదల చేసిన రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొనబోయే మంత్రులు, అధికారుల పేర్ల జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది. ఆ జాబితాలలో పేర్కొన్న వారిలో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే పాల్గొనక పోవడం గమనార్హం. అంటే, ఈ సమావేశంలో పాల్గొనమని ఆహ్వానం అందినా ఆయన పాల్గొనలేదని స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకోవడం పట్ల విముఖతతోనే హాజరు కాలేదని తెలుస్తున్నది.
మొత్తం మీద ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆహ్వానించలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే సమావేశానికి ముందే సమావేశంలో పాల్గొనే వారి జాబితా విడుదల చేశారు. అందులో పవన్ కల్యాణ్ పేరు కూడా ఉంది. అయితే మరెందుకు పవన్ కల్యాణ్ హాజరు కాలేదు? అనే ప్రశ్న తలెత్తుతోంది.
జనసేన వర్గాలు మాత్రం మరో కారణం చెబుతున్నాయి.
2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ ఘన విజయం సాధిస్తే అమ్మవారి వారాహి దీక్ష చేపడతానని మొక్కుకున్నారు. అందులో భాగంగా జూన్ 25న 11 రోజుల అమ్మవారి వారాహి దీక్ష చేపట్టారు. దీక్ష సమయంలో ద్రవ ఆహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకునేవారు. అయితే ముఖ్యమంత్రుల సమావేశం శనివారం జరగడంతో, ఈ భేటీకి ఆయన హాజరుకాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. . జనసేన పార్టీని ప్రారంభించినప్పటి నుండి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ విధానాలే అవలంభిస్తున్నారు. అందుకనే బీజేపీతో స్నేహంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి సహితం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నే ప్రధాన `రాజకీయ శత్రువు’గా పరిగణిస్తుంది.
పార్టీని ప్రారంభించిన సమయంలో ఆయన 2014 మార్చి 14న హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ హోటల్లో నిర్వహించిన జనసేన పార్టీ సదస్సులో కాంగ్రెస్‌పై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. రెండు గంటలకుపైగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమర్శలకే అధిక భాగాన్ని ఉపయోగించారు. “కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో” అంటూ నినదించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తన వ్యతిరేకతను అలానే కొనసాగిస్తూ వచ్చారు
అందుచేతనే కాంగ్రెస్ నేతలతో కలిసి వేదిక పంచుకో వడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదు అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఉద్దేశం తోటే ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా నిలిచినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలతో ఢిల్లీ స్థాయిలో బిజెపి పెద్దల దగ్గర పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరుగుతుంది అని కూడా చెబుతున్నారు.