13 ఏళ్ల ముస్లిం బాలికను 61 ఏళ్ల వృద్ధుడికి విక్రయిస్తుండగా పోలీసులు అడ్డుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. బాలికను కొనుగోలు చేసిన ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీతో పాటు బాలిక తల్లిదండ్రులపైనా కేసుపెట్టారు. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీ అనే 61 ఏళ్ల వృద్ధుడికి స్థానికంగా ఉండే 13 ఏళ్ల బాలికను విక్రయిస్తున్నారని బాలాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె తల్లి అర్షియా బేగం, అమ్మమ్మచాంద్ సుల్తాన్ సహా.,,, అకీల్ అహ్మద్, జరీనా బేగం, షబానా బేగం, షమీమ్ సుల్తానా, నస్రీన్ బేగం, జహైదా బేగం అనే మరో ఆరుగురినీ అరెస్ట్ చేసి అందరిమీదా…IPC సెక్షన్లు 370, 370 (A) r/w 511, POCSO చట్టంలోని సెక్షన్ 17 , PITA సెక్షన్ 3 , 5 కింద కేసు నమోదు చేశారు.
పోలీసులకు విషయం తెలియగానే వాళ్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి షీ టీంకు సమాచారం ఇచ్చారు. అలాగే బిలాల్ కాలనీలోని ఎర్రకుంటలో బ్రోకర్ ఉన్నారని తెలుసుకుని వారినీ అరెస్ట్ చేశారు. మొదట నిందితులు అది తమ కుటుంబ వ్యవహారమని బుకాయించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో 3 లక్షల రూపాయలకు బాలికను విక్రయించినట్టు ఆమె తల్లి ఒప్పుకుంది. విచారణలో మరికొన్ని విషయాలు తెలిశాయి. అసలైతే ఆరు నెలల క్రితమే బాలికకోసం సయ్యద్ వచ్చాడు. బాలిక తల్లి 5 లక్షలు ఇస్తేనే తప్ప ఆమెను పంపలేమంది. 3లక్షల ఇవ్వలేనంటూ సయ్యద్ తిరిగి వెళ్లిపోయాడు. తరువాత మళ్లీ వీళ్లే అతన్ని సంప్రదించారు. మూడు లక్షలకు బాలికను అప్పగించేందుకు సిద్ధమయ్యారు.
సయ్యద్ అలీ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. మరో యువతికోసం వెదుకుతుండగా పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ అకీల్ అహ్మద్ కు పరిచయం చేశారు కొందరు. వారు షహీన్ నగర్ లోని ఖుబా కాలానీకి చెందిన కొందరు మహిళలు జరీనా, షబానా, షమీమ్, నస్రీన్ ను సంప్రదించారు.
ఎర్రకుంటలో ఉండే అర్షియాబేగంకు డబ్బు అవసరం అని గుర్తించిన వాళ్లు … ఆమె 13 ఏళ్ల కుమార్తెను 3 లక్షలకు విక్రయించేలా ఒప్పించారు. బ్రోకర్లు డీల్ ఓకే చేయడంతో సయ్యద్ అలీ బాలికను తీసుకెళ్లేందుకు హైదరాబాద్ వచ్చాడు. ఈ లోగా పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు అప్రమత్తమై బాలికను కాపాడగలిగారు.
హైదరాబాద్లో అమ్మాయిల అమ్మకాలు ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020లో కూడా 16 ఏళ్ల బాలికను కేరళకు చెందిన అబ్దుల్ లతీఫ్ అనే 54 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. అప్పుడూ ఇలాగే సమాచారం రావడంతో తల్లిదండ్రులు సహా ఏడుగురు నిందితులపై పోలీసులు కేసు పెట్టారు.
సెప్టెంబర్ 2017లో హైదరాబాద్ కూడా మైనర్లను విక్రయిస్తున్న, వృద్ధులతో పెళ్లిళ్లు చేస్తున్న ముగ్గురు ముస్లిం మత పెద్దలు,8మంది అరబ్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరబ్ షేక్ లు ఇక్కడి బ్రోకర్లు, లాడ్జీల యజమానుల సహకారంతో మైనర్ బాలికలు లోబర్చుకుని లైంగికంగా వేధించిన ఘటనలూ వెలుగుచూశాయి. అహ్మద్ అబ్దుల్లా అనే ఒమన్ దేశస్తుడికి తన మైనర్ కుమార్తెను అమ్మిన వ్యక్తిపై ఆయన భార్యనే ఫిర్యాదు చేసిన ఘటనలో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.