పార్లమెంట్ బడ్దెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉభయసభ సమావేశాలను షిఫ్టుల వారీగా నిర్వహించే అవకాశం ఉంది. భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాటు చేయనున్నారు.
కోవిడ్ పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారు. సమావేశాల కాలాన్ని కుదించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నెల 25న లేదా 26న సమావేశం అవుతారని తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో సమావేశ కాలాన్ని కుదించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అదే జరిగితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశగా…అనంతరం మార్చి 14నుంచి ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఇటీవల పలువురు ఎంపీలు, పార్లమెంట్ సిబ్బంది కోవిడ్ కు గురైన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ ను పరిశీలించిన ఓం బిర్లా… భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షించారు. వయసు 60 ఏళ్ళు పైబడిన ఎంపీల పట్ల మరింత శ్రద్ధవహించాలని అధికారులను ఆదేశించారు.