ఆఫ్గనిస్తాన్ పాలనావ్యవహారాల్లో అతిజోక్యం చేసుకుంటోంది పొరుగుదేశం పాకిస్తాన్. తమ కన్నుసన్నల్లో పాలన సాగాలని పాక్ ఆశిస్తుండగా..ఆలస్యంగా తేరుకున్న తాలిబన్లు…ఎక్కడికక్కడ ఇప్పుడు చెక్ పెడుతున్నారు.
ఆఫ్గన్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం తాలిబన్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో … …ఐఎస్ఐ చీఫ్ కాబుల్ లో మకాం వేసి కరడుగట్టిన తీవ్రవాదులతో చర్చలు జరిపారు. దోహా కేంద్రంగా ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ, అమెరికా సేనలు ఆఫ్ఘన్ నుండి వైదొలగడంతో కీలక భూమిక వహించిన బరదార్ ను కాక… కరడుగట్టిన తీవ్రవాదిగా పేరొందిన ముల్లా హసన్ అఖుంద్ తాత్కాలిక ప్రధానిగా నియమించడం పాక్ జోక్యంతోనని మీడియాలో వార్తలు వచ్చాయి.
బరదార్ పాకిస్థాన్ వ్యతిరేగా, భారత్ అనుకూలురుగా ముద్ర ఉంది. అందుకే అందుకనే తమ కనుసన్నలలో ఉండే అఖుంద్ ను పట్టుబట్టి ప్రధాని అయ్యేటట్లు చేశారు. అప్పటి నుండి, అఖుండ్, బరదార్ల మధ్య ఆధిపత్యపోరు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య జరిగిన ఘర్షణలో బరదార్ గాయపడ్డారని, లేదు మరణించి ఉంటారని…లేదూ కరోనా బారిన పడ్డారనే వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాను క్షేమంగా ఉన్నానని అన్నీ పుకార్లేనని ఆయన ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
కొన్ని రోజుల క్రితం కాబూల్ విమానాశ్రయాన్ని పునర్నిర్మించి, తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు పాకిస్తాన్ ముందుకురాగా.. తాలిబాన్ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పనులను టర్కీ, ఖతార్లకు అప్పగించింది. అనంతరం, తాలిబాన్‌కు పరిపాలనలో సహాయం చేస్తామని పాకిస్తాన్ ప్రతిపాదన తేగా.. అక్కర్లేదని తిరస్కరించారు తాలిబన్ ముఖ్యనేతలు.
ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో కూడా పాకిస్తాన్ ప్రతిపాదనను తాలిబాన్ సున్నితంగా తిరస్కరించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ రూపాయిల్లో వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెప్పింది. దీనిని తాలిబాన్ నేతలు ఖండించారు. తమ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు..
ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వంతో బలమైన వ్యాపార సంబంధాలను కోరుకుంటున్నామని .. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు రెండు దేశాలు పాక్ కరెన్సీని ఉపయోగించవచ్చని తారిన్ సూచించారు. అయితే పరస్పర వ్యాపారం తమ కరెన్సీలో జరుగుతుందని… తాలిబాన్ ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్ స్పష్టం చేశారు. ‘కరెన్సీ మార్పిడి చేయం. మేం మా గుర్తింపునకు విలువ ఇస్తాం. అలాగే ఉండాలని కోరుకుంటాం, ఈ విషయంలో రాజీ పడేది లేదు’ అని వాసిక్ తెలిపారు.