భయంతో దేశం విడిచి వెళ్లి కెన్యాలో తలదాచుకుంటున్న జర్నలిస్టు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పాకిస్తాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హర్షద్ షరీఫ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్టు కెన్యా చెబుతోంది. రోడ్డు బ్లాక్ చేసినా సరే వేగంగా వెళ్లడంతో నైరోబీ పోలీసులు అనుమానంతో షరీఫ్ ఉన్న వాహనంపైకి కాల్పులు జరిపినట్టు స్పష్టం చేసింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామనీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అయితే జర్నలిస్ట్ మృతిపట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీడియాస్వేచ్ఛను హరిస్తున్నారంటూ పాక్ పాలకుల తీరుపై గళమెత్తే హర్షద్ ఇటీవలే ఆ దేశ ఆర్మీపై, ప్రధాని షరీఫ్ పై విమర్శలు చేశారు. హెచ్చరికలు రావడంతో అరెస్ట్ చేస్తారేమోనని కెన్యా వెళ్లాడు. తన సోదరుడు ఖుర్రంతో కలిసి కార్లో మగధి నుంచి నైరోబీ వెళ్తుండగా…ఈ ఘటన జరిగింది. హెచ్చరికల్ని పట్టించుకోకుండా వెళ్తుంటే అనుమానంతో కాల్పులు జరిపామని పోలీసులంటున్నారు. కారు పల్టీలు కొట్టగా అతని శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. హర్షద్ సోదరుడు గాయాలతో బయటపడ్డాడు. జర్నలిస్టు మృతిపట్ల ప్రధాని, ఆర్మీ సంతాపం వ్యక్తం చేసింది. కెన్యా ప్రధానితో మాట్లాడి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరినట్టు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అటు షరీఫ్ పై కాల్పులను వ్యతిరేకిస్తూ ఇస్లామాబాద్ సహా పలుచోట్ల జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు. కెన్యా పోలీసుల మాటలు నమ్మశక్యంగా లేవని… సమగ్ర విచారణ జరపాలని..ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.