ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ నుంచి అప్పు తీసుకున్నాను అంటూ పాకిస్థాన్ సంబర పడుతున్నది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. భారత్ అభ్యంతరం పెట్టినప్పటికీ ఐఎంఎఫ్ అప్పు ఇచ్చేసింది అంటే ఇదంతా మోదీ ప్రభుత్వం వైఫల్యం అని మన దేశంలోని కుహనా వాదులు కూడా కూని రాగాలు తీస్తున్నారు.
కానీ అప్పు ఇస్తూ ఐఎమ్ఎఫ్ పెట్టిన షరతులు చూస్తే… ఎవరికైనా చుక్కలు కనిపిస్తాయి. పాకిస్థాన్ కు అయితే పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం.
భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం ఇస్తే ఆ మొత్తాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు మాత్రమే వినియోగిస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ అదనపు షరతులు విధించింది. వాటిలో 17.6 ట్రిలియన్ల బడ్జెట్, వ్యవసాయ ఆదాయపు పన్ను సంస్కరణలు, విద్యుత్ రంగంలో సవరణలు మొదలైనవి ఉన్నాయి. వంద కోట్ల డాలర్ల ప్యాకేజీని పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి దుర్వినియోగం చేస్తుందని భారత్ అనుమానిస్తోంది.
డబ్బుల కోసం అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతు మీద పూర్తిగా ఆధారపడి ఉంది. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఐఎంఎఫ్ 3బిలియన్ డాలర్ల స్వల్పకాలిక ఋణం మంజూరు చేసింది. ఐఎంఎఫ్‌లో పాకిస్తాన్ సభ్యత్వం తీసుకున్న నాటినుంచీ ఇప్పటివరకూ 25 బెయిలౌట్ ప్యాకేజీలు తీసుకుంది. అయినా పాక్ ఆర్థిక కష్టాలు ఒక్కసారి కూడా తీరలేదు. తాజాగా ఒక బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ మంజూరు చేయడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ప్యాకేజీకి ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది, ఆ నిర్ణయం మీద తన అసంతృప్తిని స్పష్టంగా ప్రకటించింది.
ఐఎంఎఫ్ తాజా షరతుల్లో ఆర్ధిక, వ్యవసాయ, విద్యుత్, తదితర రంగాల్లో సంస్కరణలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతులను స్థిరీకరించేందుకు నిర్మాణాత్మక మార్పులు చేసేలా ఆ షరతులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన వాటిని ఒకసారి చూద్దాం…
ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం: 2026 ఆర్థిక సంవత్సరానికి గాను పాకిస్తాన్ పార్లమెంటు 17.6 ట్రిలియన్ రూపాయల బడ్జెట్‌ను ఆమోదించాలి. అందులో 1.07 ట్రిలియన్ రూపాయలు అభివృద్ధి పనులకు మాత్రమే ఖర్చు చేయాలి.
పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 2.414 ట్రిలియన్ రూపాయలు ఉండాలని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అది గతేడాది కంటె 12శాతం ఎక్కువ. నిజానికి భారత్‌పై దాడుల తర్వాత పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ను 18శాతం పెంచాలని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం భావించింది.
వ్యవసాయ ఆదాయపన్ను సంస్కరణలు: పాకిస్తాన్‌లోని నాలుగు ప్రొవిన్స్లలోనూ (పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్) 2025 జూన్ నుంచి వ్యవసాయ ఆదాయం మీద పన్ను చట్టాలను అమలు చేయాలి. అందులో భాగంగా, రిటర్న్‌లను ప్రోసెస్ చేయడానికి ఒక వేదిక కల్పించడం, పన్ను చెల్లించేవారిని గుర్తించడం, ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలుగా ప్రచారం చేయడం, వంటి ఏర్పాట్లు చేయాలి.
ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక: ఐఎంఎఫ్ సిఫారసులకు అనుగుణంగా… వాటిని పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
ఆర్థిక రంగ వ్యూహం: 2027 తర్వాత ఆర్థిక రంగ వ్యూహాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంవత్సరం ముగిసేలోగా రూపొందించాలి. 2028 నుంచీ వ్యవస్థాగతమైన, నియంత్రణా పూరితమైన వాతావరణాన్ని ఆ వ్యూహంలో పొందుపరచాలి.
విద్యుత్ రంగ సంస్కరణలు: విద్యుత్ రంగం మీద నాలుగు షరతులు దృష్టి సారించాయి. అవి…
1. 2025 జులై 1నుంచీ వార్షిక విద్యుత్ టారిఫ్‌లను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి.
2. 2026 ఫిబ్రవరి 15 నాటికి అర్ధ వార్షిక గ్యాస్ టారిఫ్‌లను నోటిఫై చేయాలి
3. జాతీయ విద్యుత్ గ్రిడ్ నుంచి పరిశ్రమలను మార్చడానికి వాటిపై శాశ్వతంగా క్యాప్టివ్ పవర్ లెవీ విధించిన ఆర్డినెన్స్‌ను 2025 మే నాటికి చట్టం చేయాలి
4. విద్యుత్ బిల్లుల మీద ఋణసేవల సర్‌ఛార్జి విధించడానికి యూనిట్ చార్జి రూ 3.21 పరిమితి తొలగించాలి. ఐఎంఎఫ్ విధించిన ఈ షరతు వల్ల విద్యుత్ రంగం అసమర్ధ నిర్వాకాలకు నిజాయితీ కలిగిన వినియోగదారులకు శిక్ష పడుతుంది.
స్పెషల్ టెక్నాలజీ జోన్స్ రాయితీలను క్రమంగా తీసివేయాలి: 2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ జోన్లు, ఇతర పారిశ్రామిక వాడలకు ఇచ్చే రాయితీలను క్రమంగా తీసివేసేందుకు వీలుగా 2025 చివరికి ప్రణాళిక సిద్ధం చేయాలి.
వాడేసిన కార్ల దిగుమతులపై ఆంక్షల తొలగింపు: వాడేసిన మోటారు వాహనాలను దిగుమతి చేసుకోవడం మీద ఆంక్షలు తొలగించడానికి 2025 జులై నాటికల్లా చట్టం చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితి ప్రకారం మూడేళ్ళు వాడిన వాహనాలను దిగుమతి చేసుకోవచ్చు. ఆ పరిమితిని ఐదేళ్ళకు పెంచాలి.
మొత్తం మీద ఈ షరతులు అన్ని అమలు చేస్తే పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కి మరో మార్గం కూడా లేదు అంత చేత నుంచి ఐ ఎం ఎఫ్ నుంచి మరోసారి బెయిల్ అవుట్ ప్యాకేజీ తీసుకోవడం ద్వారా.. పాకిస్తాన్ తన సమాధి తాను నిర్మించుకుంటూ పోతున్నట్లు అయింది.