భారత్, చైనా సరిహద్దు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. చైనా తన వక్రబుద్ధిని బయటపెడుతూనే ఉంది… ఏవేవో ఎత్తుగడలు వేస్తూనే ఉంది. భారత్‌తో నేరుగా తలపడలేక డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్ ను పురమాయించింది. విలువలనూ తుంగలో తొక్కి భారత్ పై కుట్రలుపన్నుతోంది . అయినా కూడా మన సైన్యం చైనా కుతంత్రాలను దీటుగా ఎదుర్కొంటోంది.
LAC దగ్గర చైనా సైన్యంతోపాటు పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారనే విషయం స్పష్టమవుతోంది. చైనాకు మద్దతుగా పాక్ సైన్యం అక్కడ ఉంది. తాజాగా చైనా జర్నలిస్టు షెన్ షెవీ షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. అందులో చైనా సైనికులతో పాటు గడ్డం ఉన్న ఓ జవాన్ కూడా ఉన్నాడు. అతడి రూపురేఖలు, హైట్ ను బట్టి పాకిస్తాన్ వ్యక్తి అని తెలుస్తోంది.
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలలో ఈ పాకిస్థాన్ సైనికుడు ఎందుకున్నాడనేది పలు అనుమానాలకు తావిస్తుంది. మన బలగాలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక చైనా పాకిస్థాన్ సాయం కోరినట్లుంది.
సాధారణంగా చైనా సైనికులు పొట్టివారు, అయితే చిన్నపాటి గడ్డంతో చైనా సైనికులతో పాటు ఉన్న వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు. ఈ వ్యక్తి పాకిస్థానీ సైనికుడు. ప్రత్యేకించి కొండల్లో జరిగే యుద్ధాలు, భారత్ సైనిక శక్తిసామర్థ్యాలు తెలిసిన పాక్ సైనికుడు అయి ఉంటాడు. చైనా సైనిక నిపుణులు భారత్ పర్వత యుద్ధ తంత్ర నైపుణ్యాన్నిచాలాసార్లు కొనియాడారు. అత్యంత ఎతైన కొండశిఖరాల ప్రాంతంలో తగు విధంగా యుద్ధానికి దాడులకు భారత్ సేనలు తగు విధంగా తర్ఫీదు పొందాయని ఈ విషయంలో తాము వెనుకబడ్డామని కూడా చైనా నిపుణులు అంగీకరించారు. అందుకే అన్ని విషయాలు భౌగోళిక పరిస్థితులు తెలిసిన పాకిస్థాన్ సైనికుల నుంచి పీఎల్ ఏకు తగు శిక్షణ అందుతోందని స్పష్టమవుతోంది.
చైనా, పాకిస్థాన్ కలిసి భారత్ పై కుట్రలు చేస్తున్నాయనే విషయం అనేక విషయాల ద్వారా స్పష్టం అవుతోంది. ఈ రెండు దేశాలు ఐఎస్ఐ ఉగ్రవాదులను భారత్ లోకి పంపేయత్నం చేస్తున్నాయి. మనదేశంలో విధ్వంసాలు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు తెగబడాలని… ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రహస్యంగా చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ ఐఎస్ఐని మనదేశంలోకి చొరబడాలని, దాడులు చేపట్టాలని ఆదేశించిందట. లద్దాక్ లోని వాస్తవాధీన రేఖ వెంట చైనా దుందుడుకు చర్యలు చేపట్టి భారత దళాలు అటు వైపు దృష్టి సారిస్తే, అప్పుడు మన భూభాగంలోకి జమ్ము కాశ్మీర్ నియంత్రణ రేఖ ద్వారా ఉగ్రవాదులను పంపించాలని పాక్ ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన భారత భద్రతా దళాలు సరిహద్దులో ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ ను మరింత బలోపేతం చేశాయి .
ఇక జమ్మూకాశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీకి లభించిన ఆయుధాలపై చైనాకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా ఆయుధ సామాగ్రిని జమ్మూకశ్మీర్‌లో జార విడిచింది. చైనా, పాక్ కుట్రను భగ్నం చేయడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగిస్తోంది.
ఇక ఇండియన్ ఆర్మీ చైనాపై దృష్టి పెట్టడాన్ని అదనుగా భావించిన పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టింది. మోర్టార్లతో దాడులు చేసింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందగా, నలుగురు ఆర్మీ జవానులు గాయపడ్డారు. అటు పూంచ్ సెక్టార్ లో సైతం పాక్ ఆర్మీ కాల్పులు జరపగా ఒక జవాన్ మృతి చెందాడు. పాక్ కాల్పులను ఇండియన్ ఆర్మీ కూడా సమర్థంగా తిప్పికొట్టింది. మన ఆర్మీ దాడిలో పాక్ వైపు భారీ నష్టం సంభవించింది. గత తొమ్మిది నెలలలో పాకిస్తాన్ 3600సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది.
తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమవుతున్నాయి. ఇక తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్ మ్యాప్ రూపొందించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం.
ఇక గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాన్ని విలీనం చేసుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోంది. గిల్గిత్-బాల్టిస్టాన్ ను అయిదో రాష్ట్రంగా ప్రకటించనున్నట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉంది. ఆక్రమిత, వివాదాస్పద ప్రాంతంపై ఎలాంటి చర్చలు లేకుండా, ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారన్నది భారత్ సూటి ప్రశ్న. కానీ దీనికి పాక్ నుంచి సమాధానమే లేదు. ఇలా అన్ని రకాలుగా చైనా, పాక్ లు కలిసి భారత్ పై కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. మనదేశాన్ని ఏదో చేయాలని కుట్ర పన్నుతున్నాయి.