ఓరుగల్లు కోటలో పాగా వేసేదెవరో!
తెలంగాణ రాష్ట్ర సమితి ఏకపక్ష విజయాలను సాధించే జిల్లాల్లో వరంగల్ ఒకటి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థలో కారు జోరుకు ఇప్పటి వరకు ఎదురులేదు. ఐదేండ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో సాధారణ మెజారిటీ కన్నా 14 సీట్లను ఎక్కువే గెల్చుకుంది గులాబీ పార్టీ. ఈసారి కారుకు బ్రేక్ వేయడానికి బిజెపి తహతహలాడుతున్నది. సంజయ్ బండి జోరు మీదుంది. ఈ దూకుడు ముందు గులాబీ కారు దూసుకుపోతుందో లేదో చూడాలి.
2016లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ ఎస్ 44 వార్డుల్ని గెల్చుకుంది. మొత్తం 58 వార్డుల్లో 8 చోఉట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్ నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. ఉత్తర దక్షిణ ధ్రువాల్లాంటి బిజెపి, సిపిఎం చెరో సీటుతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఈసారి సీన్ మారడం స్పష్టంగా కనిపిస్తుంది. బిజెపి జోరు మీదుంది. కాంగ్రెస్ లో గతంలో ఉన్నంత కదన కుతూహలం కనిపించడం లేదు.
ఈసారి టిఆర్ ఎస్ కు అనేక వ్యతిరేక పవనాలు ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉంది. గత ఏడాది వరదలకు నగరంలో చాలా కాలనీలు, బస్తీలు మునిగిపోయాయి. నాలాల కబ్జాల వల్ల నగర ప్రజలు అవస్థలు పడ్డారు. బంగారు తెలంగాణలో టిఆర్ ఎస్ వారే ఎక్కువ కబ్జాలు చేశారని సిటీజనం చాలా మంది ఆవేదన వెళ్లగక్కారు. కానీ హైదరాబాద్ లో ఇచ్చినట్టు ఇంటికి 10 వేల రూపాయల వరద సాయం వరంగల్ లో ఇవ్వలేదు. ఇది గులాబీ నేతలకు ఇబ్బంది కలిగించ వచ్చు. ఇక డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామంటూ కొన్ని చోట్ల పాత ఇండ్లు, గుడిసెలను ఖాళీ చేయించారు. కానీ చాల మందికి డబుల్ బెడ్రూంలు రావడానికి ఏళ్లకు ఏళ్లు పట్టింది. ఇంకా అర్హులు వేల సంఖ్యలో ఉన్నారు. వారికి జవాబు చెప్పడం టిఆర్ ఎస్ శ్రేణులకు కష్టమే. నగరంలో ఇంకా అనేక సమస్యలున్నాయి. నాలాల కబ్జాలు పూర్తిగా తొలగిపోలేదు. సమస్యలు ఒకవైపు, బండి సంజయ్ దూకుడుతో జోరు మీదున్న కాషాయ క్యాడర్ మరో వైపు. గులాబీ శిబిరంలో గుబులు పుట్టిస్తున్నాయి.
దుబ్బాకలో సంచలన విజయం కమలనాథుల జోష్ పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇంచుమించు టిఆర్ ఎస్ దగ్గరగా సీట్లు గెలవడంతో బిజెపి శ్రేణుల స్థయిర్యం అమాంతం పెరిగింది. వరంగల్ నగర, జిల్లా టిఆర్ ఎస్ నేతలపై సంజయ్ ఘాటు విమర్శలు చేస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు మోత మోగుతున్నాయి. ఇంతకీ ఎన్నికలకు ఫిబ్రవరిలో నగారా మోతుందా? ఏమో. వాయిదా పడవచ్చని గుసగుసలు వినవస్తున్నాయి.